హెచ్‌1బీః ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇది

Update: 2017-12-16 09:43 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో కెరీర్ వెతుక్కునేందుకు మ‌న సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు ఎక్కువ‌గా ఆధార‌ప‌డే హెచ్‌1బీ వీసాల విష‌యంలో అమెరికా మ‌రో చేదు క‌బురు తెలిపింది. హెచ్‌1బీ వీసా జారీ విధానంలో ఎలాంటి మార్పులూ తీసుకొనిరాలేదని - పాత విధానమే అమలవుతున్నదని ఇటీవ‌ల‌ అమెరికా ప్ర‌తినిధుల నుంచి వెలువ‌డిన వార్త‌ల సంతోషంలో ఉండ‌గానే..,దుర్వార్త‌ను వినిపించింది. హెచ్‌1బీ వీసా క‌లిగి ఉన్న వారి జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో పనిచేసేందుకు ఇప్పటివ‌ర‌కు ఆ దేశ నిబంధనల ప్రకారం అర్హత ఉంది. అయితే వ‌ల‌స విధానాల‌పై క‌త్తిగ‌ట్టిన ట్రంప్ స‌ర్కారు...ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తేయాలనుకుంటోంది.  

తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా తీసుకువ‌చ్చిన అనేక నిర్ణ‌యాల‌ను సమీక్షించ‌డం - ఏమాత్రం అవ‌కాశం దొరికినా...వాటిని మార్చివేయ‌డం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్‌1బీ డిపెండెంట్ల‌పై క‌న్నేశారు. హెచ్‌1బీ వీసా భాగ‌స్వామ్యులు సైతం అమెరికాలో ఉద్యోగం చేసుకోవ‌చ్చున‌ని ఒబామా హ‌యాంలో 2015లో ఆదేశాలు విడుద‌ల చేశారు. ఈ ప్ర‌కారం వారిలో కొందరు గ్రీన్‌ కార్డ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే వీరికి ఈ అవ‌కాశాన్ని ఎత్తివేయాల‌ని చూస్తున్న‌ట్లు అమెరికా హోంల్యాండ్ విభాగం తెలిపింది. అయితే ఇందుకు కార‌ణం తెలుప‌లేదు. కానీ ట్రంప్ జ‌పిస్తున్న స్వ‌దేశీ మంత్రం కార‌ణంగానే ఈ నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామం అమెరికాలో పనిచేస్తున్న 70 శాతం మంది హెచ్ 1బీ వీసా హోల్డర్లకు షాక్  వంటిద‌ని అంటున్నారు.

కాగా, విదేశీ ఔట్ సోర్సింగ్‌ ల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని - త‌ద్వారా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణంగా మారుతోంద‌ని ఆ దేశంలో పలువురు ఆందోళ వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హెచ్-1బీ - ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ సంయుక్త చట్టసభ సభ్యులు కొద్దికాలం క్రితం ప్ర‌తిపాదించారు. అమెరికా అధ్య‌క్ష ప‌గ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సైతం వ‌ల‌స వ్య‌తిరేక‌వాది కావ‌డంతో మ‌న‌వారిలో కొంత క‌ల‌వ‌రం నెల‌కొంది. దీన్ని నిజం చేస్తున్న‌ట్లుగా తాజా చ‌ర్య‌లు సంకేతాల‌ను ఇస్తున్నాయి.

మ‌రోవైపు, ఇటీవ‌లే హెచ్‌1బీ వీసాదారుల‌కు ఊహించ‌ని తీపిక‌బురు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చునని ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ ప్రకటించింది. అమెరికాలోని పలు సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలంటే సదరు ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా తప్పనిసరిగా ఉండాలని..అయితే అలా ఒక్క సంస్థ‌లో కాకుండా ప‌లు సంస్థ‌ల్లో కూడా ఉద్యోగాలు చేసుకోవ‌చ్చున‌నే అవ‌కాశం క‌ల్పించింది.
Tags:    

Similar News