అచ్చం బాబులా చేసిన ట్రంప్‌..త‌ర్వాతేమైందంటే?

Update: 2018-08-17 14:30 GMT
చేతిలోకి అధికారం వ‌స్తే చాలు.. చెల‌రేగిపోయే బ్యాచ్ ఒక‌టి ఉంటుంది. అప్ప‌టివ‌ర‌కూ తాము చెప్పిన నీతుల్ని తుంగ‌లోకి తొక్కేసి.. చెల‌రేగిపోతుంటారు. మ‌రో త‌ర‌హా నేత‌లు ఉంటారు. వివాదాల్ని వెంట పెట్టుకొని న‌డుస్తూ.. వివాదాలే ఊపిరిగా బండి లాగిస్తుంటారు. అలాంటోళ్ల చేతికి ప‌వ‌ర్ వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న దానికి నిద‌ర్శ‌నం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌హాశ‌యుడు.

అయ్య‌గారికి మామూలుగానే నోటి దురుసు ఎక్కువ‌. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేస్తుంటాడు. ఎవ‌రిని లెక్క చేయ‌డు. ప్ర‌జాస్వామ్యం లాంటి మాట‌ల్ని ఈ సంప‌న్న పారిశ్రామిక‌వేత్తకు పిచ్చ లైట్‌. అలాంటోడి చేతికి ప్ర‌పంచానికే పెద్ద‌న్న కుర్చీలో కూర్చునే అవ‌కాశం వ‌స్తే ఎలా ఉంటుంది?  త‌న‌కు మించిన తోపు మ‌రెవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

అలాంటి ట్రంప్ కు అమెరిక‌న్ మీడియా అంటే అస్స‌లు న‌చ్చ‌దు. త‌న త‌ప్పుల్ని అదే ప‌నిగా ఎత్తి చూపించ‌టం అస్స‌లు న‌చ్చ‌ట్లేదు. అధ్యక్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగిన వేళ‌లోనే మీడియాకు త‌న‌దైన శైలిలో వార్నింగ్ లు ఇచ్చేయ‌టం మొద‌లుపెట్టారు. సంప్ర‌దాయ పాత్రికేయాన్ని న‌మ్మిన వాషింగ్ట‌న్ పోస్ట్ లాంటి యాజ‌మాన్యానికి ట్రంప్ తీరు ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేని ప‌రిస్థితి. దీంతో.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా ట్రంప్ ను ఎండ‌గ‌ట్ట‌టం మొద‌లెట్టారు. త‌న లాంటి తోపు విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌ని వాష్టింగ్ట‌న్ పోస్టు లాంటి మీడియాసంస్థ‌లంటే చాలు.. ట్రంప్ మండిపడ‌టం మొద‌లెట్టాడు.

క‌ట్ చేస్తే.. ఏపీలో చంద్ర‌బాబు తీరు కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. బాబుకు భ‌జ‌న చేస్తే ఓకే. అలా కాకుండా.. ఆయ‌న‌లోని త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తే ఎక్క‌డ‌లేని కోపం వ‌స్తుంది. మీడియాకు తాను ఇచ్చినంత స్వేచ్ఛ మ‌రెవ‌రూ ఇవ్వ‌ర‌న్న‌ట్లు చెప్పుకునే చంద్ర‌బాబులో ఇంకో కోణం చూడాలంటే.. ఆయ‌న త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తూ నాలుగు అక్ష‌రాలు రాస్తే స‌రి.

పిల్ల‌నిచ్చిన మామ‌ను వెన్నుపోటు పొడిచి గ‌ద్దెనెక్కిన తీరును అప్ప‌టి మీడియా నోరు క‌ట్టేసుకోవ‌టం.. మౌనంగా ఉండ‌టం వెనుక ఏం జ‌రిగింద‌న్న నిజం.. అప్ప‌టి పొలిటిక‌ల్ జ‌ర్న‌లిస్టుల‌కు చాలాబాగా తెలుసు.  బాబు తీరును ఎండ‌గ‌ట్టే మీడియా సంస్థ సాక్షి రూపంలో రావ‌టం ఆయ‌న జీర్ణించుకోలేని వైనం తెలిసిందే. త‌న అడుగుల‌కు మ‌డుగులు వొత్తే మీడియా సంస్థ‌లు అల‌వాటైన బాబుకు.. సాక్షి మాదిరి మీడియా సంస్థ త‌గ‌ల్లేదు. బాబు త‌ప్పుల్ని సూటిగా అడిగేయ‌టం ఆయ‌నకు అస్స‌లు న‌చ్చ‌లేదు.

నేను బాబును.. చంద్ర‌బాబును.. క్లింట‌న్ లాంటి వ్య‌క్తిని హైద‌రాబాద్‌కు తీసుకొచ్చి ఐస్ చేసినోడ్ని.. మైక్రోసాఫ్ట్ అధిప‌తి మ‌న‌సు దోచుకున్నోడినంటూ గొప్ప‌లు చెప్పే బాబు వెనుక ఉన్న న‌లుపును విప్పి చూపించ‌టం అస్స‌లు న‌చ్చ‌లేదు. అందుకే.. త‌న‌ను వ్య‌తిరేకించే మీడియా సంస్థ‌ల‌పైన అప్ర‌క‌టిత బ్యాన్ విధించ‌టం.. సాక్షి మీడియా సంస్థ‌కు చెందిన పాత్రికేయుల్ని ప్రెస్ మీట్ల‌కు పిల‌వ‌క‌పోవ‌టం.. అధికారిక కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానం పంప‌క‌పోవ‌టం లాంటివి మొద‌లెట్టారు.

ఐదేళ్ల పాటు పాలించేందుకు మాత్ర‌మే ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారే కానీ.. మీడియాకు ప‌రిమితులు విధించేందుకు బాబుకు ఓటు వేయ‌లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న మ‌ర్చిపోయారు. మ‌న ద‌గ్గ‌ర బాబు మాదిరే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సైతం త‌న‌ను ఇరుకున‌ప‌డేసేలా సీఎన్ ఎన్ చాన‌ల్ కు చెందిన రిపోర్ట‌ర్ ప్ర‌శ్న వేయ‌టం అస్స‌లు న‌చ్చ‌లేదు. అంతే.. అత‌గాడిని త‌న మీడియా స‌మావేశాల‌కు రాకుండా బ్యాన్ పెట్టేశారు.

మ‌న ద‌గ్గ‌ర అయితే.. బాబు వ్య‌వ‌హార‌శైలి మీద గొంతెత్తి ప్ర‌శ్నించే ప‌ని ఆయ‌న అనుకూల మీడియా చేయ‌దు. కానీ.. అమెరికాలో అలా కాదు. ఏకంగా 350 మీడియా సంస్థ‌లు ట్రంప్ మీద గ‌ళం విప్పాయి. ఆయ‌న తీరును తీవ్రంగా ఖండించాయి. అమెరికా చ‌రిత్ర‌లో ఇలాంటిది ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు. మీడియా స్వేచ్ఛ‌పై పాల‌కులు విధించే ప‌రిమితుల్ని మీడియా సంస్థ‌లు క‌లిసిక‌ట్టుగా అమెరికాలో మాదిరి పోరాడాలే కానీ.. ఇక్క‌డ మాదిరి త‌మ అభిమాన పాల‌కుల విష‌యంలో చూసిచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. వ్య‌వ‌స్థ‌ల ప్ర‌తిష్ఠ‌ల్ని.. వాటికి ఉండే విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ తీసిన‌ట్లేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

Tags:    

Similar News