కోలుకుంటున్న కీవ్.. తెరుచుకున్న థియేటర్..తొలిరోజే హౌస్ఫుల్

Update: 2022-06-07 23:30 GMT
దాదాపు 100 రోజులుగా రష్యా ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాంబుల ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. మూణ్నెళ్లుగా రష్యా సాగిస్తున్న భీకర యుద్ధం తో ఉక్రెయిన్ నగరాలు వణికిపోతూనే ఉన్నాయి. చాలా వరకు ప్రాంతాలు రష్యా అధీనంలోకి వెళ్లిపోయాయి. కానీ కొన్ని నగరాలు మాత్రం ఇప్పుడిప్పుడే బాంబుల మోత నుంచి కోలుకుంటున్నాయి. సాధారణ జీవనం గడిపే దిశకు అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్లో మూణ్నెళ్ల తర్వాత ఓ సినిమా థియేటర్ తెరుచుకుంది. ఓపెన్ చేసిన తొలిరోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.

మూణ్నెళ్లుగా రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంతో ప్రజల సాధారణ జీవనశైలి గతి తప్పింది. ఇప్పటికే రష్యా బాంబుల మోత తో చాలా వరకు ఉక్రెయిన్లోని నగరాలు ఆ దేశంలో అధీనంలోకి వెళ్లాయి. కానీ కొన్ని నగరాలు మాత్రం నెమ్మదిగా రష్యా కోరల నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ సాధారణ జీవనం వైపు అడుగులేస్తున్నాయి.

ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం నెమ్మదిగా కోలుకుంటోంది. దాదాపు మూణ్నెళ్ల తర్వాత అక్కడ ఓ సినిమా థియేటర్ తెరిచారు. ఇప్పటి వరకు బాంబుల మోతతో భయంభయంగా బతికిన కీవ్ వాసులు కాస్త మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడి నుంచి ఉపశమనానికి థియేటర్ బాట పట్టారు. అయితే థియేటర్ తెరిచిన మొదటి రోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం.

ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడిన రష్యా సేనలు ఆ ప్రాంతాలను సర్వ నాశనం చేశాయి. ఇదే సమయంలో రాజధాని కీవ్‌పై దాడి చేసినా ఉక్రెయిన్ సేనలు తమ రాజధానిని కాపాడుకోవడానికి భీకరంగా తన సేనలతో ప్రతి దాడులు చేశాయి. ఉక్రెయిన్ సేనల దెబ్బకు రష్యా వెనుదిరిగింది. ఈ క్రమంలో కీవ్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ రోజువారి కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తోంది.  సినిమా థియేటర్లు, నేషనల్‌ ఒపేరా వంటి ప్రదర్శనశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కీవ్‌ శివారులోని పొదిల్‌లో ఉన్న ఓ థియేటర్‌ కూడా ప్రదర్శనను మొదలుపెట్టింది.

‘యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారో..? లేదో అని భావించాం. అసలు థియేటర్‌ గురించి ఆలోచిస్తారా.. అసలు ఆసక్తి ఉందా? అని అనుకున్నాం. కానీ, తొలిరోజు మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని నటుల్లో ఒకరైన యురియ్‌ ఫెలిపెంకో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం కొంతమంది నటులతోనే ప్రదర్శనను కొనసాగిస్తున్నామన్నారు.

ఓవైపు ఉక్రెయిన్ పౌరులు తమ సాధారణ జీవనం వైపు అడుగులు వేస్తుంటే రష్యా మాత్రం మరిన్ని ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం లో మునిగిపోయింది. ముఖ్యంగా డాన్‌బాస్‌ ప్రాంతాన్ని పూర్తిగా వశం చేసుకోవాలని భావిస్తున్న రష్యా.. వ్యూహాత్మక నగరమైన సీవీరో దొనెట్స్క్‌పై విరుచుకుపడుతోంది.  ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌-రష్యా సేనల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ సమయంలో ఉక్రెయిన్‌ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను ఇచ్చేందుకు పశ్చిమదేశాలు కూడా ముందుకు వస్తున్నాయి.

కీవ్ నగరంలో సాధారణ కార్యకలాపాలు మొదలయ్యాయనుకుంటున్న తరుణంలో..ఆ నగరం పై మరోసారి దాడి చేసినట్లు రష్యా ప్రకటించింది. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందించిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ధ్వంసం చేసేందుకే కీవ్‌పై దాడి చేసినట్లు రష్యా పేర్కొంది. కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించేందుకు సుదీర్ఘ దూరం పయనించే క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఐరోపా కూటమి ఉక్రెయిన్‌కు అందించిన టీ-72 ట్యాంకులు సహా ఇతర ఆయుధాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.
Tags:    

Similar News