దేశ వ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నఅసెంబ్లీ.. లోక్ సభస్థానాలకు ఉప ఎన్నికల్ని నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ నియోజకవర్గాలు..ఒక లోక సభ స్థానంలో ఈ ఎన్నికల్ని నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నప్పటికీ.. ఉప ఎన్నికల్ని మాత్రం నిర్వహించకపోవటం ఆసక్తికరంగా మారింది.
అయితే.. వాటిని వచ్చే ఏడాది నిర్వహిస్తామని పేర్కొంది. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంది. ఆ ఎన్నికలతో పాటు.. ఇప్పుడు నిర్వహించని స్థానాల్లోనూ ఉప ఎన్నికల్ని నిర్వహించే వీలుంది. తాజాగా ఉప ఎన్నికలు ప్రకటించిన 56 స్థానాల్లో మధ్య ప్రదేశ్ లోనే అత్యధికంగా 27 స్థానాలు ఉండటం తెలిసిందే.
ఆ రాష్ట్రంలో ఆ మధ్యన చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే కారణంగా చెప్పాలి. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలోకి వెళ్లటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆ రాష్ట్రంలో 27 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో.. అక్కడ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.