బిహార్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయట!

Update: 2020-08-23 17:30 GMT
కన్ఫూజన్ క్లియర్ అవుతోంది. అంతకంతకూ క్లారిటీ పెరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది క్వశ్చన్ గా మారింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ పలు రాజకీయ పార్టీల నుంచి వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలు యథాతధంగా జరుగుతాయని స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా బిహార్ రాష్ట్రానికి ఈ అక్టోబరు.. నవంబరులో జరగాల్సిన ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని తేల్చారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీ గడువు నవంబరు 29తో ముగియనుంది. ఆ లోపు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో బిహార ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ అసెంబ్లీ ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతోంది. మరో పార్టీ ఎల్జీపీ కూడా ఎన్నికల వాయిదా వైపే మొగ్గు చూపుతున్నాయి.దీనికి సంబంధించి వారు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలతో ఓటర్లకు గ్లౌజులు ఇవ్వటం.. పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్తో పాటు.. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని.. ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు రూపొందించటంతో పాటు.. ఆన్ లైన్ లో నామినేషన్లు దాఖలు చేసే విధానానికి తెర తీసింది. దీంతో.. ఎన్నికలు ఎప్పటిలానే షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న సంకేతాల్ని ఇచ్చింది. తాజాగా.. అదే విషయాన్ని వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తయారవుతోంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ నేతృత్వంలో బీజేపీ.. జేడీయూ.. ఎల్జేపీలు కలిసి పోటీ చేయనున్నట్లుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. తమ కూటమి బిహార్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తాజాగా వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో విపక్షాల పని అయిపోయిందని.. వారిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినట్లుగా పేర్కొన్నారు. కరోనాతో పాటు.. రాష్ట్రంలో వరదల్ని నితీశ్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని.. తమ కూటమికి తిరుగులేదని పేర్కొన్నారు. అధికారపక్షం దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ.. ఎన్నికలు మరికాస్త ఆలస్యంగా వస్తే మంచిదన్న ఆలోచనలో విపక్షాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. వారి ఆశలు నెరవేరేలా లేవని చెప్పకతప్పదు.
Tags:    

Similar News