తనతో పాటు హరీశ్ కోరలు పీకాలని కేసీఆర్ అప్పట్లో ప్లాన్ చేశారట

Update: 2021-07-19 04:39 GMT
నోటి నుంచి మాట రానంతవరకు అంతా బాగుందనే భావన కలుగుతుంది. కానీ.. చెడిన తర్వాత వచ్చే మాటలు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారుతుంటాయి. తెలంగాణలో తాజాగా అలాంటి రాజకీయమే ఇప్పుడు వెలుగు చూస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆయన రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శలు.. ఘాటు ఆరోపణలు చేస్తారు. అయినా ఆయన పెద్దగా పట్టించుకోనట్లు ఉంటారు. అదే సమయంలో.. తనను ఇరుకున పెట్టేలా విమర్శలు చేసే వారిని తనదైన శైలిలో టార్గెట్ చేసి.. వారి నోటి నుంచి వచ్చే మాటలకు పెద్దగా విలువ లేకుండా చేసే మైండ్ గేమ్ లు గులాబీ బాస్ వద్ద పుష్కలంగా ఉంటాయి.

అసలు గొడవ ఏమిటన్న విషయం ఇప్పటికి వెలుగు చూడనప్పటికీ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ అనుసరించిన వైఖరిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సొంత పార్టీలోనే ఇలాంటి పరిస్థితి కనిపించినప్పుడు ప్రజల్లో వినిపించే మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భూకబ్జా మరక  వేసి.. గులాబీ కారు నుంచి దిగేలా షాకిచ్చిన కేసీఆర్  పైన తరచూ ఈటల ఆచితూచి మాట్లాడే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేసే వరకు వ్యవహారం ముదిరిందని చెప్పాలి.

ప్రస్తుతం బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల ముందున్నది ఆయన రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి గెలిచేందుకు వీలుగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటివరకు ఈటల రాజేందర్ నేరుగా బరిలోకి దిగుతారన్న మాట వినిపించినా.. ఇటీవల చోటు చేసుకున్నపరిణామాల నేపథ్యంలో అయితే ఈటల కానీ లేదంటే ఆయన సతీమణి జమున కానీ ఉప ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్.

2018లో జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నం  చేశారన్నారు. తాను చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించిన ఈటల.. నిజాం సర్కారును తలపించేలా ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన  బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన.. దుబ్బాక.. సాగర్ ఉప ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కోరారు.

తనతో పాటు హరీశ్ కోరలు పీకాలన్న ఆలోచనతో 2018 ఎన్నికల తర్వాత మంత్రి పదవులు ఇవ్వని మాట నిజం కాదా? అని ప్రశ్నించిన ఈటల.. ఇప్పుడు తనను ఓడించేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గం నుంచి కుల సంఘాల నేతల్ని పిలిపించుకొని తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారన్నారు. ఏదో ఒక రోజు తనకు జరిగినట్లే హరీశ్ కు కూడా జరుగుతుందని హాట్ కామెంట్ చేశారు. ఇప్పటికే హరీశ్ మీద ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. తరచూ తన ప్రస్తావన తీసుకురావటం ద్వారా ఈటల తనను ఇరుకున పడేస్తున్నట్లుగా హరీశ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు చెబుతారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో మరోసారి తల పట్టుకోవటం ఖాయమన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమవారం) నుంచి తన నియోజకవర్గం నుంచి పాదయాత్రను ఈటల మొదలు పెట్టనున్నారు. మరి.. ఈ పాదయాత్రతో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. 
Tags:    

Similar News