హరీష్ రావుపై ఈటల సంచలన ఆరోపణలు

Update: 2021-09-02 14:30 GMT
హుజూరాబాద్ రాజకీయం రంజుగా సాగుతోంది. టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ కాబడ్డ ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన ఈటల ఇప్పుడు అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈనెలలో ఎన్నికలు జరుగనున్నాయనే వార్తల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో పాటు సామాన్యులు కూడా హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా హుజూరాబాద్ లోని మధువని గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావుపై విరుచుకుపడ్డారు.

హరీష్ రావు హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నాడని.. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని ఈటల ఎద్దేవా చేశారు. హరీష్ రావు ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్ధతి ఉంటుందని.. అది ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని మంత్రి హరీష్ రావును ఈటల రాజేందర్ హెచ్చరించారు.

అంతటితో ఆగని ఈటల తాజాగా హరీష్ రావుకు సవాల్ విసిరారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని.. డబుల్ బెడ్ రూం కట్టలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు కుంకుమ భరిణులు పంపించి ఓట్లు అడిగే స్థాయికి దిగజారారంటూ కామెంట్స్ చేశారు. వీటన్నింటి మీద హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి హరీష్ రావుకు ఈటల రాజేందర్ సవాల్ చేశారు.

బహిరంగ సభకు తాను ఏర్పాట్లు చేస్తానని.. నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ అయితే బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ హరీష్ రావుకు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఈటల సవాల్ పై బహిరంగ చర్చకు మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి. 
Tags:    

Similar News