చెప్పును నెత్తి మీద పెట్టుకొని మరీ ప్రెస్ మీట్ పెట్టిన కామ్రేడ్

Update: 2022-01-01 09:30 GMT
కామ్రేడ్ అన్నంతనే ఒకలాంటి గంభీరత్వం.. అంతకు మించిన గౌరవ మర్యాదలు ఉండేవి. వాటిని తన స్థాయికి తగ్గించేసిన క్రెడిట్ మాత్రం సీపీఐ నారాయణ సొంతమని చెప్పాలి. విమర్శలు చేయటం బాగానే ఉన్నా.. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం సబబుగా ఉండదు. సంచలనాల కోసమన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం సబబు కాదు. కానీ.. ఇలాంటివన్నీ చేయటం ద్వారా.. గతంలో కామ్రేడ్లకు ఉండే గౌరవ మర్యాదల్ని మంటగలిపిన వారిలో కామ్రేడ్ నారాయణ ముందుంటారు.

ఆయన సమకాలీకుడు సీపీఎంకు చెందిన రాఘవుల్ని చూస్తే.. తమ మాటల్ని జనం వినటం మానేశారన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన కామ్ గా ఉండిపోయారే కానీ.. నోటికి పని చెప్పింది లేదు.రాఘవుల మాస్టారికి భిన్నంగా నారాయణ మాత్రం ఇప్పటికి యమా యాక్టివ్ గా చెలరేగిపోతుంటారు.

కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సబబుగా ఉన్నప్పటికీ.. చాలా సందర్భాల్లో అవసరం లేకుండానే మాట్లాడిన వైనం కనిపిస్తూ ఉంటుంది. ఆయనతో వచ్చిన సమస్య.. తాను విభేదించిన అంశాల మీద మోతాదు మించిన రీతిలో వ్యాఖ్యలు చేయటం. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్నే చూస్తే.. చెప్పులపై కేంద్రం జీఎస్టీ భారాన్ని మోపంపై ఆయన విమర్శలు చేయాలని డిసైడ్ అయ్యారు.

దాన్ని చేసే విధంగా చేస్తే బాగుంటుంది. కానీ.. ఆయన మాటలు ఎంత డ్రమెటిక్ గా ఉంటాయంటే.. సామాన్యులు ధరించే చెప్పుల మీద కేంద్రం విధించిన జీఎస్టీ భారంతో సామాన్యుడు కాళ్లకు చెప్పులు ధరించే స్థితిలో లేరని.. అవి అరిగిపోతే మరో జత కొనలేని పరిస్థితుల్లో ఉన్నాయంటూ ఆయన మాటలు వింటే నవ్వు రాక మానదు.

ఇవాల్టికి కొన్ని బడా సూపర్ మార్కెట్లో.. రోడ్ల మీద చెప్పులు పెట్టే అమ్మే వారు.. యాభై.. డెబ్భై రూపాయిలకు కూడా చెప్పుల్ని అమ్మేస్తున్నారు. అలాంటప్పుడు సామాన్యులు తమ చెప్పులు అరిగిపోతే మళ్లీ కొనలేని దీన స్థితిలో ఉన్నారని చెప్పటం కామెడీగా కనిపించక మానదు.

ఈ తరహా మాటలతో నారాయణ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. అంతేనా.. తాజాగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. కేంద్రం తీరును తప్పు పడుతూ నెత్తి మీద చెప్పుల్ని పెట్టుకొని మీడియాతో మాట్లాడారు. చెప్పుల మీద జీఎస్టీ బాదుడుకు నిరసన ఓకే కానీ.. చెప్పే మాటలు.. వాస్తవానికి దూరంగా ఉండటంతోనే అసలు సమస్యంతా.

ఇవాల్టి రోజున చెప్పుల జత రూ.10 వేల వరకు ఉన్నాయి. సామాన్యుడు ధరించేందుకు యాభై రూపాయిలు.. వంద రూపాయిలకు కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ.. కొనలేనంత దారుణమైన పరిస్థితుల్లో చెప్పుల ధరలు లేకున్నా.. జీఎస్టీ బాదుడు సరికాదని చెప్పటం వరకు ఓకే. కానీ.. అంతకు మించి ఆయన నోటి నుంచి వచ్చే మాటలతోనే ఇబ్బంది. వాట్సాప్.. సోషల్ మీడియాలు వచ్చేసిన డిజిటల్ జమానాలో.. పాత చింతకాయ పద్దతిలో మాట్లాడటం ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని ఆయన ఎప్పటికి గుర్తిస్తారో?

Tags:    

Similar News