ప్రధాని పేరు మీద పథకాలు ఉండకూడదా?

Update: 2016-02-26 08:00 GMT
కాంగ్రెస్ నేతల మాటలు వింటుంటే.. ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కొంతకాలం వరకూ మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు తమ వాదనను వినిపించేందుకు ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం ఆశ్చర్యాన్ని కలిగించటమే కాదు.. ఆందోళనకు గురి చేయటం ఖాయం.

లోక్ సభలో కాంగ్రస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే.. ‘ప్రధానమంత్రి’ పేరు మీదే ప్రభుత్వం పథకాల్ని ప్రవేశపెట్టటం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ పేరు మీద కాకుండా ప్రధానమంత్రి పేరు మీద పథకాల్ని ప్రకటించటాన్ని ప్రశ్నించటం గమనార్హం. దేశాన్ని నడిపించే పదవి పేరిట పథకాల్ని అమలు చేయటం తప్పా? అన్నది ఒక ప్రశ్న అయితే.. దేశంలో అమలయ్యే ఎన్నో పథకాలకు కేవలం గాంధీ ఫ్యామిలీకే పెద్దపీట వేసిన కాంగ్రెస్.. ఆ విషయాన్నిమర్చిపోయి తాజా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

అటు  కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రాల్లో తాము అధికారంలో ఉంటే అయితే ఇందిర.. లేదంటే రాజీవ్ పేర్లతో పథకాల్ని అమలు చేసే కాంగ్రెస్ నాయకత్వం.. ఈ రోజున ప్రధానమంత్రి పదవి పేరు మీద పథకాల్ని అమలు చేస్తుంటే తప్పు పట్టటం చూస్తే.. తాము చేసేది మాత్రమే సరైనదన్న భావన వారిలో కనిపించక మానదు. ఈ రోజుకీ దేశంలో అమలవుతున్న పథకాల్లో 600లకు పైగా (కచ్ఛితంగా అయితే 618గా చెబుతున్నారు) పథకాలకు గాంధీ ప్యామిలీ సభ్యుల పేరు మీదనే ఉండటాన్ని మర్చిపోకూడదు. తమ అధినేత్రి కుటుంబానికి చెందిన వారి పేర్లతో వందలాది పథకాలు ఉండొచ్చు కానీ.. ప్రధానమంత్రి పదవి పేరిట మాత్రం పథకాలు ఉండకూడదా? అన్న ప్రశ్న ఉదయించకమానదు.
Tags:    

Similar News