కేసీఆర్ కల కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Update: 2020-01-28 04:33 GMT
తెలంగాణ చరిత్ర లో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని.. శిలాఫలకంపై కేసీఆర్ అన్న పేరుతో భవిష్యత్ తెలంగాణ తనను తలుచుకోవాలని.. పైగా వాస్తు లేని సచివాలయాన్ని పునర్నిర్మించాలని కేసీఆర్ యోచించారు. అనుకున్నదే తడువుగా రెడీ అయ్యారు. సచివాలయం ఖాళీ చేయించారు. మార్చేసి కూలగొట్టడానికి రెడీ అయ్యారు. కానీ.. కేసీఆర్ ఒకటి తలిస్తే ప్రతిపక్షాలు మరోటి తలచాయి.. కేసీఆర్ కలకు హైకోర్టుకెక్కి అడ్డుపుల్ల వేశాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ సచివాలయం సహా అసెంబ్లీ భవనం నిర్మాణం కూడా హైకోర్టులో పెండింగ్ లో పడిపోయాయి.

తాజాగా కేసీఆర్ కల నెరవేరబోతోంది. తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కేసీఆర్ కు గొప్ప ఊరటనిచ్చింది. సచివాలయ డిజైన్లు, ప్రణాళికపై తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ప్లాన్, బడ్జెట్ పై తుది నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవచ్చని సూచించింది. అయితే సచివాలయానికి అయ్య వ్యయంపై వివరాలు సమర్పించాలని తాము ఓకే అన్నాకే మొదలు పెట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

కేసీఆర్ రెండోసారి గద్దెనెక్కగానే వాస్తు సరిగా లేని ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి నూతన సచివాలయాన్ని నిర్మించాలని యోచించారు. అయితే నూతన సచివాలయ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో హైకోర్టు స్టే ఇచ్చింది.

తాజాగా ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ స్టే పై వివరణ కోరగా.. కూల్చివేత ఆపాలని అన్నామని.. కానీ నిర్మాణానికి సంబంధించిన నమూనా రూపకల్పన, అంచనా వ్యయం విషయంలో ఎలాంటి స్టేలు ఇవ్వలేదని హైకోర్టు తెలిపింది. ఫిబ్రవరి 12లోపు నిర్మాణ వ్యయానికి సంబంధించిన ఖర్చు, డిజైన్లు అందిస్తే విచారణ జరుపుతామని ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. దీంతో సచివాలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి..
Tags:    

Similar News