మహబూబాబాద్ రోడ్డు ప్రమాదం లో భారీ ట్విస్ట్ .. శవాలపై ఆభరణాలు , రూ.లక్ష డబ్బు మాయం

Update: 2021-01-30 11:30 GMT
మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొనడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొన్ని రోజుల్లో ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా ప్రమాదం జరగడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదం లో మునిగిపోయింది. ఇటీవల వీరి కుమార్తె వివాహం కుదిరింది.

పెళ్లికి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు వధువుతో పాటు వారి కుటుంబసభ్యులు ఆటోలో వరంగల్‌ కు వెళ్తున్నారు. అంతలోనే వీరు ప్రయాణిస్తున్న ఆటోను మర్రిమిట్ట వద్ద లారీ ఢీకొనడం తో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది.

గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన జాతోట్‌ కస్నానాయక్‌, కళ్యాణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలోనే  కూతురుకి  డోర్నకల్‌ మండలం చామ్లా తండా పరిధిలోని ధరావత్‌ తండాకు చెందిన ధరావత్‌ వెంకన్న, లలిత దంపతుల పెద్ద కుమారుడు వినోద్‌ తో ప్రమీలకు పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 8వ తేదీన ఎంగేజ్ ‌మెంట్‌ జరగగా, వచ్చే నెల 10వ వివాహానికి తేదీ నిర్ణయించారు. పెళ్లి పనుల్లో భాగంగా దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలుకు ప్రమీల కుటుంబం శుక్రవారం వరంగల్‌ కు బయలుదేరారు.

తండాకు చెందిన డ్రైవర్‌ జాటోతు రాములునాయక్‌ కు చెందిన ఆటో మాట్లాడుకుని పెళ్లికూతురు జాటోతు ప్రమీల, ఆమె తల్లి కళ్యాణి  , అన్న ప్రదీప్ , బాబాయ్‌ జాటోత్‌ ప్రసాద్ , చిన్నమ్మ లక్ష్మి  వెళ్లారు. ఇంతలోనే గూడూరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరి ఆటోను మర్రిమిట్ట వద్ద బలంగా ఢీకొని సుమారు100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఆటో నుజ్జునుజ్జు కాగా ఆరుగురు అక్కడికక్కడే మత్యువాత పడ్డారు.

 అయితే వస్త్రాలు, సామాగ్రి కొనుగోలు కోసం తీసుకెళ్తున్న రూ.లక్ష నగదుతో పాటు మృతుల శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు ప్రమాదం జరిగాక కనిపించడం లేదని మృతుల బంధువులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News