కేసీఆర్ జమానాలో నిరసన సిటీ బయటే

Update: 2017-03-09 04:46 GMT
ఉద్యమ నాయకుడి నేతృత్వంలో ప్రభుత్వం ఎలా ఉంటుంది? దాని నిర్ణయాలు ఎలా ఉంటాయి?ఉద్యమ స్ఫూర్తిగా ఏర్పడినట్లుగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధనకు సుదీర్ఘకాలం ఉద్యమించిన నేతరాష్ట్రాధినేతగా అవతరించిన వేళ.. నిరసన గళం వినిపించే అవకాశం ఎంత ఉంటుందన్న విషయంపై ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసినట్లే.

గతంలో నిరసనలు.. ధర్నాలు..ఆందోళనలు నిర్వహించాలంటే.. నగరంలో పలుచోట్ల నిర్వహించేవారు. దీంతో.. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు.  దీంతో.. నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కు సమీపంలో ధర్నా చౌక్ ను ఏర్పాటు చేశారు. ఆ మాటకు వస్తే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన వేలాది నిరసనలు ఈ ధర్నా చౌక్ సాక్షిగా జరిగాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇప్పుడా ధర్నా చౌక్ లో నిరసన గళాలు వినిపించకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ధర్నా చౌక్ లో జరుపుతున్న నిరసనల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరింది. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండానే హైదరాబాద్ పోలీసులు  నిర్ణయాన్ని తీసేసుకున్నారు.

ఇకపై.. నిరసనలు.. ధర్నాలు..ఆందోళనలు లాంటి వాటిని ధర్నా చౌక్ లో అనుమతించేది లేదని తేల్చేశారు.ఇకపై నిరసనలు చేయాలని అనుకుంటే నగర శివారు ప్రాంతాలైన నాలుగు ప్రాంతాల్ని ఎంపిక చేయటం గమనార్హం. వీటిల్లో ఒకటి శంషాబాద్ అయితే.. రెండోది మల్కాజిగిరి డివిజన్ లోని దుండిగల్.. కాప్రా. మూడోది  బాలానగర్ లోని జవహర్ నగర్ ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్లలో అనుమతి తీసుకొని మాత్రమే నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. సో.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకించే ఉద్యమ గళాలు ఏవైనా సరే.. సిటీలోకి అడుగు పెట్టే అవకాశమే లేదన్నమాట. నిరసన గళాలు ఏవైనా శివారుకే పరిమితం కావాలన్న మాట. ‘‘ఉద్యమ నేతకు పాలనా పగ్గాలు వస్తే.. నిర్ణయాలు ఇలా ఉంటాయన్న మాట’’అంటూ పలువురు అభిప్రాయపడటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News