ఐఏఎస్ కు తిప్పలు తెచ్చిన భార్య షాపింగ్ పిచ్చి

Update: 2016-10-02 09:36 GMT
ప్రపంచమంతా ఆన్ లైన్ షాపింగ్ అంటూ ఊగిపోతోంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. ఆన్ లైన్ సంస్థలూ అదే స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తుండడంతో అవసరమా కాదా అన్నది చూసుకోకుండా కొనుగోళ్లు జరుపుతున్నారు. చేతిలో స్మార్టు ఫోన్ - క్రెడిట్ కార్డు ఉంటే చాలు ఏదో ఒకటి కొనకుండా ఆగలేకపోతున్నారు. కానీ... మరీ అంతలా పిచ్చిపిచ్చిగా కొనేస్తే ఆదాయ పన్ను శాఖ కంట్లో పడే ప్రమాదమూ ఉంది. చాలామందికి ఈ విషయం తెలియకపోయినా ఇప్పుడు తాజాగా మధ్య ప్రదేశ్ లో ఓ ఐఏఎస్ అధికారి భార్యకు ఎదురైన అనుభవం చూస్తే మాత్రం ఆన్ లైన్ షాపింగులో దూకుడు తగ్గించాల్సిందేనంటున్నారు చాలామంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి భార్య ఒకరు అదేపనిగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తారట.  ఏకంగా 10 లక్షల విలువైన కొనుగోళ్లు జరిపారామె. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమెకు నోటీసులు పంపించారు. భార్య చేసిన పనికి ఆ అధికారి ఇరుకునపడ్డారు. అయితే... ఆయన కూడా ఏం తక్కువ తినలేదు. ఐటీ శాఖకు ఇచ్చిన వివరణలో తన తెలివితేటలంతా చూపించారు. తన భార్యకు కంపల్సివ్ బయింగ్ డిజార్డర్ (ఏదో ఒకటి కొంటూనే ఉండే పిచ్చి) ఉందని ఆ ఐఏఎస్ అధికారి తెలిపారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో జరిగే ఆన్ లైన్ లావాదేవీలను పరిశీలించేందుకు ఓ సాఫ్ట్ వేర్ సాయంతో నిఘా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐఏఎస్ అధికారి సతీమణి షాపింగ్ వ్యవహారం వారి కంట్లో పడడంతో నోటీసులు ఇచ్చారు. దీనికి ఆమె వివరణ ఇవ్వాల్సి ఉంది. ఏ డిజార్డర్ ఉన్నా కూడా కొనడం అయితే వాస్తవం కాబట్టి ఆ డబ్బు ఎక్కడిదో ఎలా వచ్చిందో చెప్పాల్సిన బాధ్యతయితే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News