దేశం ఇప్పుడు రెండు ముక్కలైందా?

Update: 2016-11-15 22:30 GMT
పెద్దనోట్ల రద్దుతో ప్రధాని మోడీ దేశాన్ని రెండు ముక్కలు చేశారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. పెద్దనోట్ల రద్దు సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న బడా బాబులు.. నల్ల కుబేరులు తప్పించి సామాన్యులు.. మధ్యతరగతి.. ఎగువ తరగతి వారి వరకూ అందరూ హ్యాపీగా ఫీల్ కావటమే కాదు మోడీ మొనగాడు భయ్ అంటూ పొగిడిన పొగడ్త పొగడకుండా పొగిడేశారని చెప్పాలి.  అయితే.. ప్రధాని తన సంచలన ప్రకటనను ప్రకటించి మూడు.. నాలుగు రోజల వరకూ దేశంలోని పలువురు మోడీ నిర్ణయాన్ని మెచ్చుకుంటూనే ఉన్నారు.

ఆ తర్వాతే లెక్కలో తేడా వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లు మూడురోజులకు బ్యాంకులు.. ఏటీఎంల సమస్యలు తీరకపోవటంతో సామాన్యుల్లో ఒకలాంటి అసంతృప్తి మొదలైంది. ఇదే దేశాన్ని రెండుముక్కలు అయ్యేలా చేసింది. ఒక ముక్క.. మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంటే.. మరో ముక్కకు చెందిన సభ్యులు మాత్రం మోడీ తీరును పూర్తి స్థాయిలో అభినందిస్తున్నారు. వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

ఆన్ లైన్ మొదలు ఆఫ్ లైన్ వరకూ అన్నీ చోట్ల ఒకేలాంటి పరిస్థితి. వీధుల్లో నలుగురు కలిసినా.. హోటల్.. ఛాయ్ దుకాణం వద్ద ముక్కుముఖం తెలీనోళ్ల నోటి నుంచి పెద్ద నోట్ల రద్దు ముచ్చట వస్తే చాలు.. అదే పనిగా మస్తు మాటలు వచ్చేస్తున్నాయ్. డబ్బులున్నోళ్లు సక్కగా ఉన్నారని.. డబ్బుల్లేనోళ్లకే తిప్పలన్నీ వచ్చి పడతాయని వారు ఆక్రోశం. ఇంతకాలం ఏటీఎంలు.. బ్యాంకుల వద్ద ఎలాంటి తిప్పలు ఉండేవి కావని.. అలాంటిది ఇప్పుడు మోడీ పుణ్యమా అని పెద్ద పెద్ద క్యూలలో డబ్బుల కోసం వెయిట్ చేయాల్సి వస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెద్దనోట్ల రద్దు కష్టాలపై ఎంత ఘాటుగా విమర్శలు చేస్తున్నారో.. అంతే మద్దతుగా జనాలు నిలవటంతో ఇప్పుడు ఎక్కడికి అక్కడ చర్చల మీద చర్చలు సాగుతున్న పరిస్థితి. సినిమా టికెట్ల కోసం.. జియో సిమ్ ల కోసం.. ఇలా వెయిట్ చేయటం దేశ పౌరులకు కొత్తేం కాదని.. అప్పుడేమీ లేని తిప్పలన్నీ ఇప్పుడే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా వ్యాఖ్యానించటం ఏమిటన్న వాదనను విపిపిస్తున్నారు.

మరోవైపు.. మోడీ చేసిన ప్రకటన తెలివి తక్కువతోకూడుకున్నదని.. దీనికి మద్దతుగా తాము ఎందుకు నిలవాల్సిన అవసరం ఏమిటని? తాజా నిర్ణయంతో మరింత అవినీతి పెరిగిపోతుందని.. నల్ల కుబేరులకు కొత్త దారులుకల్పించినట్లు అవుతుందని.. నిజంగా మోడీకి అంత కమిట్ మెంట్ ఉంటే.. వేలాది కోట్లు అప్పు తీసుకొని చెల్లించని బడా పారిశ్రామికవేత్తల్ని ఎందుకుఅదుపులోకి తీసుకోరు?వారిపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనల ముచ్చట ఎలా ఉన్నా.. ఒక్కటి మాత్రం నిజం. మోడీ తీసుకున్న నోట్ల రద్దు పుణ్యమా అని దేశం ఇప్పుడు రెండు ముక్కలు అడ్డంగా చీలిపోయిందనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News