అమృత.. జయ కూతురేనా?

Update: 2017-11-28 16:46 GMT
జయలలిత... తమిళ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పాపులర్ అయిన మహిళా నేత. ఆమె మరణించి ఏడాదవుతోంది. ఆమె మరణం తరువాత తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యత అలానే ఉంది. ఆ తరువాత రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతున్నాయో.. జయ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లోనూ అన్నే ట్విస్టులు ఏర్పడుతున్నాయి. జయ కుమార్తెనని ఒకరు.. కుమారుడినని ఒకరు ఇలా తమను తాము జయ వారసులుగా నిరూపించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు కొందరు. తాజాగా బెంగళూరుకు చెందిన అమృత అనే మరో మహిళ తానే జయ కుమార్తెనంటూ రంగంలోకి దిగారు. కావాలంటే డీఎన్‌ఏ టెస్టు చేసుకోమంటున్నారు. అయితే... గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఏదో జరగబోతోందన్న మాట తమిళనాట వినిపిస్తోంది. అంతేకాదు... జయ సమీప బంధువులు కూడా దీనిపై అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అమృత జయ కుమార్తె కాదో అవునో తెలియదు  కానీ, జయలలితకు మాత్రం ఒక కుమార్తె ఉండేదంటూ జయ సమీప బంధువు వెల్లడించడం ఆసక్తి రేపుతోంది.
    
జయలలిత తండ్రి జయరామ్‌కు సోదరి కుమార్తె అయిన లలిత ఈ విషయంపై  సన్ టీవీతో మాట్లాడారు. జయ కుమార్తెనని చెప్తున్న అమృత కూడా లలితే తనకు ‘జయ కుమార్తెవు నువ్వు’ అని చెప్పిందని చెప్తోంది. ఈ నేపథ్యంలోనే లలితతో సన్ టీవీ మాట్లాడింది. జయలలిత కుటుంబంతో ఉన్న అనుబంధం నుంచి, వారి మధ్య పెరిగిన దూరం వరకు అన్నీ మాట్లాడింది.  1970 నుంచి బెంగళూరులో ఉన్న తమకి చెన్నైలో ఉన్న జయలలిత కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు తగ్గిపోయాయని లలిత అన్నారు. జయలిత తల్లిదండ్రులు జయరామ్, సంధ్య మరణించిన తరువాత జయతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని లలిత చెప్పారు.
    
అయితే.. ఆ తరువాత తమ పెద్దమ్మ ఒకరు 1980లో జయలలిత వద్దకు వెళ్లారని.. అప్పటికి జయ గర్భవతని.. తల్లిలేని పిల్ల అన్న సానుభూతితో ఆవిడ జయ వద్ద ఉంటూ అన్నీ చూసుకున్నారని.. జయకు పెళ్లి కాకపోవడంతో రహస్యంగా కాన్పు చేయించారని లలిత చెప్పారు.  జయలలితకు కుమార్తె పుట్టారని, అయితే.. ఆ సంగతి ఎవరికీ చెప్పొద్దని జయ తమ పెద్దమ్మ వద్ద మాట తీసుకుందని.. అయితే, తనకు ఆవిడ ఆ రహస్యాన్ని చెప్పిందని లలిత చెప్పింది. ఆ తరువాత ఆ అమ్మాయిని బెంగళూరులో ఉన్న జయలలిత పెద్దమ్మ కూతురు శైలజ పెంచుతున్నట్లు తెలిసిందని లలిత తెలిపారు.
    
అయితే... అన్నీ చెప్పిన లలిత చివర్లో ట్విస్టిచ్చారు. ఇప్పుడీ అమృత జయ  కుమార్తెనో కాదో నాకు తెలియదు కానీ.. ఈ అమ్మాయి అమృత కూడా శైలజ దగ్గర పెరిగిన అమ్మాయేనని లలిత  చెప్పారు. తానేమీ కచ్చితంగా  చెప్పలేనని,  డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆమె అంటున్నారు. అమృత తనను మూడు నెలల కిందట కలిసిందని.. ఆ సందర్భంలో గతాన్ని ఆమెకు చెప్పానని అన్నారు. మొత్తానికి ఈసారి ఇదేదో గట్టి విషయమే అంటున్నారు తమిళనాట ప్రజలు.
Tags:    

Similar News