వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ డిప్యూటీ సీఎం కుమార్తె పోటీ చేయ‌నున్నారా?

Update: 2022-07-02 03:06 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దాదాపు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. అయితే అప్పుడే పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోయింది. ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌ని ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా న‌మ్ముతున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలు త‌మ అస్త్ర‌శ‌స్త్రాల‌కు ప‌దునుపెడుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను కూడా బ‌రిలోకి దించ‌డానికి నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ కోవ‌లో డిప్యూటీ సీఎం క‌ళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి కుమార్తె కృపాల‌క్ష్మి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెను చిత్తూరు జిల్లాలోని గంగాధ‌ర నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పటి వరకు రాజకీయంగా అంతగా బయటకు రాని ఆయ‌న కుమార్తె కృపాల‌క్ష్మి ఇటీవల రాజకీయంగా క్రియాశీల‌కంగా ఉంటున్నారు. తరచూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కీలక నేతలను కలుస్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్ కేబినెట్ లో ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న‌ నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. జ‌గ‌న్ మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ, రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ క‌ళ‌త్తూరు నారాయ‌ణ‌స్వామి చాన్సు కొట్టేశారు.

అంతేకాకుండా రెండోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వైఎస్ జ‌గ‌న్ కు సాష్టాంగ న‌మ‌స్కారం చేశారు. ఇప్పడు ఆయ‌న వ‌య‌సు 73 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి ఆయ‌న‌కు 75 ఏళ్లు వ‌స్తాయి. వయోభారం నేపథ్యంలో ఆయన కుమార్తెను రంగంలోకి దించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా కృపాలక్ష్మి గుంటూరు జిల్లా తాడేపల్లి వ‌చ్చి ఆయ‌న‌ను క‌ల‌వ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డిని కూడా క‌లిశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కృపాల‌క్ష్మి పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టే.
Tags:    

Similar News