ఏపీని పాలిస్తున్నది ఆమెట...?

Update: 2022-04-30 13:46 GMT
ఏపీని పాలిస్తున్నది ఎవరు అంటే చిన్న పిల్లవాడిని అడిగినా జవాబు ఠక్కున చెబుతారు జగన్ అని.సీఎం ఎవరు అంటే ఆయనే అంటారు. అయితే టీడీపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రం జగన్ ఏపీని  పాలించడంలేదు అని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు, వైఎస్ భారతి ఏపీని పాలిస్తున్నారు అని కూడా కొత్త విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక తెర వెనకా ఎదుటా  పెత్తనం అంతా సజ్జల రామక్రిష్ణారెడ్డి చేస్తున్నారు అని కూడా ఆరోపించారు.

ఏపీలో వైఎస్సార్ పాలన తీసుకువస్తామని పాదయాత్ర వేళ వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ ఫ్యామిలీని మొత్తం దూరం చేశారని ఆయన అంటున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పార్టీకి దూరమైపోయారని, ఇపుడు వైఎస్ జగన్  కూడా కాకుండా  భారతి పాలిస్తున్నారు అని అయ్యన్న సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.

ఇది జనాలను మోసం చేయడం కాదా అని ఆయన నిలదీశారు. దీన్ని రాజన్న రాజ్యం అని అంటారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో సీనియర్ మంత్రులు, పెద్దలు చాలా మంది ఉన్నారని, వారందరినీ శాసించడానికి సజ్జల ఎవరని ఆయన నిలదీశారు. మరో వైపు చూస్తే తెలనాణా మంత్రి కేటీయార్ ఏపీలో రోడ్లు బాలేవు, విద్యుతు లేదు, నీళ్ళు లేవు అంటూ చేసిన కామెంట్స్ లో తప్పేముంది అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

ఏపీలో ఇపుడున్న ప‌రిస్థితికి ఏ కోశానా సిగ్గుపడకుండా వైసీపీ మంత్రులు కేటీయార్ మీద మాటల దాడి చేయడమేంటి అని ఆయన నిలదీశారు. ఏపీలో మంత్రులు తమ మీద వచ్చే విమర్శలకు కౌంటర్లు ఇచ్చే బదులు పాలనలో సత్తా చూపించాలని ఆయన సలహా ఇచ్చారు.

మూడేళ్ళూ ఏమీ చేయకుండా గడిపేశారని, కనీసం చివరి రెండేళ్లు అయినా పాలన సవ్యంగా చేయాలని ఆయన కోరారు. మంచి చేస్తే ఎవరూ ఏపీని విమర్శించలేరు కదా అని అయ్యన్న అనడం విశేషం. తప్పులు మీ దగ్గర ఉంచుకుని ఎవరి మీద పడితే వారి మీద దాడి చేయాలని చూడడం మంచి విధానం కాదు అంటున్నారు.

మొత్తానికి ఈ విషయాలు ఎలా ఉన్నా ఏపీని వైఎస్ భారతి పాలిస్తున్నారు అంటూ అయ్యన్న కొత్త విషయం చెప్పడం సంచలనమే. ఆమె పొలిటికల్ గా చూస్తే ఎపుడూ బయటకు రాలేదు, పైగా జగన్ తెల్లారి లేచింది మొదలు అధికారిక స్థాయిలో  సమీక్షలు చేస్తూ కనిపిస్తారు. మరి సడెన్ గా వైఎస్ భారతి పేరుని అయ్యన్న లాగడం వెనక రాజకీయం ఏంటో, దీని వెనక టీడీపీ వ్యూహాలు ఏంటో చూడాలి.
Tags:    

Similar News