అందుకే అతన్ని తీన్మార్ మల్లన్న అంటారు?

Update: 2021-03-21 06:30 GMT
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు తీన్మార్ మల్లన్న. ఇప్పటికే యూట్యూబ్ చానళ్లలో ఆయన ప్రోగ్రాంలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన చేసే విమర్శలు అన్ని ఇన్ని కావు. సూటిగా.. ఛెళ్లుమనిపించేలా ఉండే ఆయన మాటలు ఆయన్ను మిగిలిన వారికంటే భిన్నంగా నిలిచేలా చేశాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ పల్లాకు పోటీగా తీన్మార్ మల్లన్నకు ఓట్లు పడ్డాయి.

ప్రగతిభవన్ మొదలుకొని.. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కళ్లు మొత్తం నల్గొండ ఫలితం మీదనే ఉన్నాయన్న మల్లన్న.. ఎన్నికల్లో గెలిచిన పల్లాను అభినందించారు. అక్కడితో ఆగని ఆయన.. పల్లా చేసిన తప్పుల చిట్టాను విప్పి విమర్శలతో చెడుగుడు ఆడేసుకున్నాడు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసంపల్లా రూ.100 కోట్లు ఖర్చు చేశారని.. దొంగ ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు.

కేవలం మూడు శాతం ఓట్లతో మాత్రమే గెలిచిన పల్లాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని.. ఇకనైనా దొంగ ఓట్లు వేయించే అలవాటును మానుకోవాలన్నారు. సామాన్యుడినైన తనను తెలంగాణ ప్రజలు భుజాలకు ఎత్తుకున్నారని.. ఒక నిండు గర్భిణి తనకు ఓటు వేయటం కోసం ఆపరేషన్ వాయిదా వేసుకుందని.. కాలు విరిగిన ఒక తల్లి అలానే వచ్చి ఓటు వేసిందని.. ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన ఒక సోదరుడు తన జర్నీ ప్లాన్ మార్చుకొని మరీ ఓటేశారన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు వందశాతం గెలిచారన్నారు. ప్రగతిభవన్ గోడలు పగులకొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. అప్పుడు ఒక సామాన్యుడ్ని సీఎం కుర్చీలో కూర్చోబెడతామని చెప్పారు. తన పోటీతో.. సామాన్యుడు ఎవరైనా పోటీకి రావొచ్చన్న విషయాన్ని నిరూపించిన్లుగా మల్లన్న పేర్కొన్నారు. నిజమే.. అది కూడా పాయింటే.
Tags:    

Similar News