ఎడ‌ప్పాడికి ఎదురెళితే... ఐటీ సాకిచ్చిందే!

Update: 2017-09-21 12:06 GMT
త‌మిళ‌నాట స‌రికొత్త రాజ‌కీయం న‌డుస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌మిళ‌నాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి - దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం ఒక్క‌సారిగా త‌మిళ రాజ‌కీయాల్లో మారిపోయాయి. ఎప్పుడేం జ‌రుగుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఇప్పుడు అక్కడ క‌నిపిస్తోంది. జ‌య బ‌తికున్నంత కాలం కేసులున్నా కూడా నిక్షేపంలా కాలం వెళ్ల‌దీసిన ఆమె నెచ్చెలి శశిక‌ళ‌... రాజ‌కీయంగా చ‌క్రం తిప్ప‌బోయి ఏకంగా జైలులోప‌లికి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. ఇక త‌న వార‌సుడిత‌డేనంటూ శశిక‌ళ చూపించిన ఆమె మేన‌ల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్ కూడా అంత‌గా క్లిక్ కాలేద‌నే చెప్పాలి. శ‌శిక‌ళ న‌మ్మిన‌బంటుగానే బ‌రిలోకి దిగిన సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వం ఎప్పుడెప్పుడు కూలిపోతుందా? అన్న కోణంలోనూ పెద్ద ఎత్తున క‌థ‌నాలు వినిపించాయి. ఇక అత్త త‌ర‌ఫున వకాల్తా పుచ్చుకున్న దినక‌ర‌న్... ఎడ‌ప్పాడి స‌ర్కారును కూల‌దోయ‌డ‌మ‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఎడ‌ప్పాడి ప్ర‌భుత్వాన్ని ప‌డగొట్టే ద‌మ్ము గానీ, ధైర్యం గానీ ఏ ఒక్క‌రికీ లేవ‌ని తేల్చె చెప్పేసిన‌ట్లైంది.

ఎడ‌ప్పాడికి ఏమాత్రం ఎదురు వెళ్లినా స‌హించేది లేద‌న్న కోణంలో ఇప్పుడు ఐటీ రంగం రంగంలోకి దిగిపోయింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే ఐటీ శాఖ‌... ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వానికి ఎందుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విష‌యానికొస్తే... మోదీ స‌ర్కారు ఆశీస్సులు ఉన్న ప‌ళ‌నిస్వామి త‌ర‌హా సీఎంలంద‌రికీ ఐటీ శాఖ మ‌ద్ద‌తుగానే వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఈ క్ర‌మంలోనే ఐటీ శాఖ త‌న‌పై న‌లువైపుల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా కూడా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా... త‌న‌దైన శైలి కొత్త త‌ర‌హా దాడుల‌కు శ్రీ‌కారం చుట్టేసింది. ఇక తమిళ‌నాడులో నేటి ఉద‌యం జ‌రిగిన ఆస‌క్తిక‌ర ఘ‌టన విష‌యానికి వ‌స్తే... ఎడప్పాడి ప్రభుత్వంపై తిరుబాటు చేసి మూడు వారాలకు పైగా రిసార్ట్ రాజకీయాలు చేస్తున్న ఆ రాష్ట్ర మాజీ మంత్రి - దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాక్ ఇచ్చారు.

గురువారం తమిళనాడులోని కరూరులో అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. సెంథిల్ బాలాజీ ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. బాలాజీ అక్రమాస్తులు గుర్తించడానికి మొత్తం 8 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక చీటింగ్ కేసులు కూడా బాలాజీపై నమోదు కావడంతో పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేస్తారన్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఐటీ దాడుల స‌మాచారాన్ని కాస్తంత ముందుగానే తెలుసుకున్న బాలాజీ చాలా వేగంగా స్పందించాడ‌ట‌. ఈ స్పంద‌న ఎలాగుందంటే... ఎలాగూ త‌న‌పై జ‌ర‌గ‌నున్న ఐటీ దాడులు ఉద్దేశ‌పూర్వ‌కంగానే అన్న విష‌యాన్ని గ్ర‌హించిన ఆయ‌న క‌ర్ణాట‌క‌లోని కొడుగు రిసార్ట్ నుంచి మంగ‌ళ‌వార‌మే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడట‌.
Tags:    

Similar News