'పశ్చిమం' లో ఈసారి జాగ్రత్తపడ్డ జగన్‌..!

Update: 2019-04-12 10:24 GMT
ఏపీ ధాన్యాగారంగా పేర్కొనే పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా వైసీపీ గెలువలేకపోయింది. దీంతో ఈసారి ఎక్కువగా జగన్‌ కోస్తాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సొంత జిల్లా కావడంతో ఆయన ఈ జిల్లాలోని భీమవరం నుంచి నామినేషన్‌ వేశారు. దీంతో ఆయనకు ఈ సీట్టు దక్కే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన ప్రాబల్యంతోనే టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగలిగింది. ఈసారి ఎవరికివారే పోటీ చేయడంతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందింది. జనసేన - బీజేపీ పొత్తుతో పాటు కాంగ్రెస్‌ పై ఉన్న వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చింది. దీంతో చంద్రబాబు సైతం ఈ జిల్లాను ఎక్కువగా పట్టించుకున్నారు.  ఈ జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఎమ్మెల్యేల అవినీతి - ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత గత ఎన్నికల్లోని సీన్‌ రిపీట్‌ అయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.   పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదైనప్పటికీ ప్రజల్లో చైతన్యం వచ్చి తమ ఓటును ఏకపక్షంగా కాకుండా నచ్చిన వారికే వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీసీ నినాదాన్ని వైసీపీ అధినేత జగన్‌ పశ్చిమగోదావరి జిల్లాలో  మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకోలేకపోయిన ఆయన ఈసారి బీసీలకు న్యాయం చేస్తానని - కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానన్న హామీ ఫలించినట్లు కనిపిస్తోందంటున్నారు. బలిజ - గౌడ సామాజికవ వర్గం జగన్‌ వైపే మొగ్గు చూపినట్లు పోలింగ్‌ తరువాత అర్థమవుతోంది. ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయకూడదనే ఉద్దేశంతో ఈసారి జగన్‌ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

ఇక జనసేన పార్టీతో ప్రభంజనం సృష్టించిన వపన్‌ కల్యాణ్‌ సొంత జిల్లాలో ఎన్ని స్థానాలు దక్కించుకుంటాడడనే చర్చ తీవ్రమైంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ వార్‌ తీవ్రంగా సాగుతోంది. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో కాపు ఓట్లన్నీ పవన్‌ అభ్యర్థులకే పడుతాయనుకున్నా.. ఆయన ప్రచార శైలి మాత్రం కొందరికి నచ్చలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రధాన పార్టీలపై ప్రభావం చూపే సత్తా నాయకుడు లేకపోవడం జనసేనకు మైనస్‌ గా మారిందని అంటున్నారు. దీంతో పశ్చిమగోదావరి ఈసారి ఎవరికి కంచుకోటగా మారుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే పశ్చిమగోదావరిలో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఇక్కడి గెలుపుపై అన్ని పార్టీలు ఆశలు పెంచుకున్నాయి.



Tags:    

Similar News