జగన్:అపజయానికి ఐదు మెట్లు-4(అతి విశ్వాసం)

Update: 2015-09-25 18:09 GMT
వ్యక్తిగతంగా - పార్టీపరంగా ఎన్నిఇబ్బందులు ఎదురైనప్పటికీ జగన్ తాను ఎంతగానో ఎదురుచూసిన ఎన్నికల వచ్చేనాటికి బలంగానే ఉన్నారు.  అయితే... అది వాపా? బలుపా? అందరిలోనూ అనుమానం. అతివిశ్వాసానికి మారుపేరైన జగన్ దాన్ని బలుపే అని బలంగా విశ్వసించగా... టీడీపీ, దానికి అనుకూలంగా ఉండే పత్రికలు మాత్రం అది వాపు తప్ప ఇంకేమీ కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. జగన్ కు వ్యతిరేకంగా అప్పటికి అయిదేళ్లుగా చెబుతున్న కథలే మళ్లీమళ్లీ చెప్పి ప్రజల చెవులను ఊదరగొట్టాయి. అయితే... సర్వేలు మాత్రం జగనేమీ పిల్లకాకి కాదని... ఆయన గెలుస్తాడని.. లేనిపక్షంలో గట్టిపోటీ ఉంటుందని చెప్పాయి.

మరోవైపు విభజన కారణంగా కాంగ్రెస్ కుదేలైపోయింది... ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆ పార్టీ నేతలే అనుకున్నారు. సగం మంది పోటీ చేయడానికే భయపడిపోయారు. టీడీపీ కూడా ఏమంత బలంగా లేదు. అసలు చంద్రబాబుకే నమ్మకం లేదు. వైసీపీని, జగన్ ను చూసి చంద్రబాబు విపరీతంగా భయపడుతున్నారు. ఆ సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన జగన్ అతి విశ్వాసానికి పోయారు. తన గెలుపును ఎవరూ ఆపలేరని... సీఎం తానేనన్న భ్రమల్లో ఉండేవారు. పార్టీ వర్గాల వద్దా అదే మాట చెబుతుండేవారు.

నిజానికి వైసీపీ అప్పటికి బలంగానే ఉంది. ముక్కూమొఖం తెలియని నాయకులు కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలవడమే దానికి ఉదాహరణ. అంతా అనుకూలంగానే ఉన్నా జగన్ ఎన్నికల్లో విఫలమయ్యారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం సాధించలేకపోవడం...ఎలక్షనీరింగ్ తెలియకపోవడంతో దెబ్బతిన్నారు.

అదే సమయంలో చంద్రబాబు అనేక అంశాలు కలిసొచ్చాయి.. ఎన్నికలకు ముందు చివరివారంరోజుల్లో సమీకరణాలు మారిపోయాయి. చంద్రబాబు తన రాజకీయ, ఎన్నికల అనుభవాలన్నీ ఉపయోగించుకుని మిణుకుమిణుకుమంటున్న తన గెలుపు ఆశలను ఒక్కసారిగా వెలిగే చేసుకోగలిగారు. బాగా వెలుగుతున్న గెలుపు దీపాన్ని కూడా జగన్ కాపాడుకోలేకపోయారు. అతి విశ్వాసమే ఆయన కొంపముంచగా... మీడియా సహకారం... పవన్ కళ్యాణ్ సహాయం వంటివన్నీ చంద్రబాబును ఒడ్డున పడేశాయి. అయితే... వైసీపీకి వచ్చిన సీట్లను చూస్తే జగన్ జాగ్రత్తగా ఉంటే గెలిచేవాడని చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పదు.  

... ఆ విధంగా ఎన్నికల సమయంలోనూ స్వయంకృతాపరాధాలు, అతివిశ్వాసంతోనే గొప్ప అవకాశాన్ని మిస్సయ్యాడు జగన్.

-గరుడ

Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.
Tags:    

Similar News