పోల‌వ‌రం.. రాజ‌ధాని సినిమాలు ఆపు బాబు!

Update: 2018-12-25 05:33 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు.  బాబు తీరును సునిశితంగా త‌ప్పు ప‌ట్టారు. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో బాబు చేసిన త‌ప్పుల్ని ఏక‌రువు పెట్టారు. ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టేలా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణిని ఆయ‌న తీవ్ర స్వ‌రంతో ఖండించారు. ప‌నుల కంటే ప్ర‌చారానికి ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చే బాబు.. పోల‌వ‌రం.. రాజ‌ధాని పేరుతో సినిమాలు చూపిస్తున్నార‌ని.. నాలుగున్న‌రేళ్లుగా ఒక‌టే గ్రాఫిక్స్ ను చూపిస్తూ కాలం గ‌డిపేస్తున్న‌ట్లుగా ఆయ‌న ఫైర్ అయ్యారు.

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో గ‌డిచిన‌కొన్ని నెలులుగా జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలో సాగుతోంది. తాజాగా ఆయ‌న మెళియాపుట్టిలో ప్ర‌జా సందోహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా బాబుపై ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల ప‌రంప‌రను జ‌గ‌న్ మాట‌ల్లోనే చెబితే..

+  ఇంటికి గోడలు కట్టకుండా - శ్లాబ్‌ వేయకుండా ఇంటి ప్రారంభోత్సవానికి పిలిచి భోజనం పెడితే ఆ మనిషిని ఏమంటారు? పిచ్చోడంటారు. లేదా మనల్ని పిచ్చిపట్టించడానికి చేస్తున్నాడంటాం. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో అదే చేస్తున్నాడు. 48 గేట్లకు గాను ఒక గేటు పెట్టి ప్రారంభోత్సవం అంటూ మనకు సినిమా చూపిస్తున్నాడు.

+  రాజధాని మరో సినిమా. మీరంతా బాహుబలి సినిమా చూశారా? అందులో రాజధాని సెట్టింగులు చూశారా? అదే మన రాజధాని కోట. చంద్రబాబు గ్రాఫిక్స్‌. రాజధాని అంటే బాహుబలి సినిమా చూడండంటాడు. రాజధానిలో శాశ్వత నిర్మాణానికి ఒక్కటంటే ఒక్క ఇటుక వేయలేదు. పర్మినెంటు బిల్డింగ్‌ ఒక్కటంటే ఒక్కటి కనిపించదు. అంతా టెంపరరీ. తాత్కాలిక అసెంబ్లీ - తాత్కాలిక సెక్రటేరియట్ - తాత్కాలిక అది.. తాత్కాలిక ఇది.. తాత్కాలిక భవనాల సంగతి ఎలా ఉందో తెలుసా? బయట మూడించుల వర్షం పడితే లోపల ఆరించుల వర్షం పడుతుంది చంద్రబాబు  పుణ్యాన. 

+  నాలుగేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసి ఈ రోజు శ్వేతపత్రమని తెల్లకాగితం రిలీజ్‌ చేశావు. ఈ తెల్ల కాగితాలతో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నావు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయలేదని ఇవాళ అంటున్నావు. 20 మంది ఎంపీలను పక్కన పెట్టుకుని రాష్ట్రానికి న్యాయం చేయలేని నీవు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడవేనా? రాజకీయాల నుంచి వైదొలగిపో.. పక్కకు తప్పుకో

+  రాహుల్‌ గాంధీ 2015 జులై 23న అనంతపురం వచ్చినప్పుడు ఇదే చంద్రబాబునాయుడు ఏమన్నాడో తెలుసా? ఏముఖం పెట్టుకుని వస్తున్నావు? ఏం చేశారని? ఇంకా బతికున్నామా.. లేమా.. అని చూడటానికా? లేకపోతే పుండు మీద కారం చల్లి పోవాలనా? కష్టాలలో ఉండేది మీవల్లే కదా? కాంగ్రెస్‌ పార్టీకి సహకరించే వాళ్లనేమనాలి? ఇది న్యాయమేనా? రాష్ట్ర ద్రోహులు కాదా వీరందరూ? రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్లీ తగుదునమ్మా అంటూ ఇక్కడికి వెక్కిరించడానికి వస్తున్నారా? కాంగ్రెస్‌ ను శాశ్వతంగా బాయ్‌ కాట్‌ చేయాలి. అప్పటికి కూడా మన కసి తీరదు. వారిని ఇగ్నోర్‌ చేయాలి. ఛీ కొట్టాలి. రాష్ట్రంలోకి రాకుండా భూస్థాపితం చేయాలన్నాడు.  ఇలాంటి కాంగ్రెస్‌ తో ఈ పెద్దమనిషి బాబు  ఇప్పుడు నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నారు.

+  చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో కరవు - తుపానులు - నిరుద్యోగం - మందు బాటిల్‌ ఇచ్చాడు. ఇసుక దోపిడీ - భూముల కుంభకోణాలు - రాజ్యాగం ఉల్లంఘనలు.. ఇది రాక్షస పాలన కాదా? ఈ నాలుగున్నరేళ్లలో ఏమిచ్చావయ్యా అని అడిగితే శ్వేతపత్రాలు ఇస్తున్నాడట. తెల్ల కాగితాలు ఇచ్చాడట. ఈ తెల్ల కాగితాలపై ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.

+  గతంలో నాన్నగారి పాలన గుర్తుందా? అప్పట్లో నన్ను చూసి - నా ప్రభుత్వ పనితీరును - అభివృద్ధిని చూసి ఓటేయండి అని అడిగారు. ఎవ్వరితోనూ పొత్తు కోసం ఎగబడలేదు నాన్నగారు. దాన్ని అభివృద్ధి అంటారు. కానీ చంద్రబాబు ఇప్పుడేమంటున్నారో తెలుసా? రాష్ట్ర ప్రజలు 2014 ఎన్నికల్లో 17 మంది ఎంపీలను ఆయనకు కట్టబెట్టారు. ఈ 17 మంది సరిపోరన్నట్లుగా మరో ముగ్గురిని సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు.

+  మొత్తం 25 మంది ఎంపీలకు  20 మందిని ఆయన దగ్గరే అట్టి పెట్టుకున్నారు. ఇద్దరిని కేంద్ర మంత్రులుగా చేసి నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేశాడు. ఇప్పుడు బీజేపీకి విడాకులు ఇచ్చిన తర్వాత కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందంటున్నాడు. ఈసారి నాకు 25కు 25 ఎంపీలను ఇవ్వండి.. నేనింకా ఏమేమో చేసేస్తానని మన చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు. 20 మంది ఎంపీలను మీ దగ్గర పెట్టుకుని - ఇందులో ఇద్దరిని మంత్రులు చేసి నాలుగేళ్ల పాటు మీరు.. బీజేపీ చిలకా గోరింకల్లా కాపురం చేశారు. నువ్వు మోడీని పొగిడితే ఆయన నిన్ను పొగడడం.. అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేశారు. రాష్ట్రానికి మేలు చేయలేనప్పుడు నీవు రాజకీయాల్లో ఎందుకు ఉండాలి? పక్కకు తప్పుకో.

+  చంద్రబాబు ఈ మధ్యకాలంలో బీజేపీకి విడాకులిచ్చి - ఇప్పుడు కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఆ కొత్త సినిమా పేరు ‘కాంగ్రెస్‌ పార్టీతో కొత్త సంసారం’. కొత్త సినిమా ఈ మధ్యకాలంలో తీస్తున్నాడు. 2015లో బీజేపీతో సంసారం చేస్తున్నప్పుడు చిలకా గోరింకల్లా వారి కాపురం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ ను బహిష్కరించాలన్నాడు. ఇప్పుడు బీజేపీతో సంసారమైపోయి విడాకులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌తో దోస్తీ చేశాడు. కాంగ్రెస్‌ తో కొత్తకాపురం మొదలు పెట్టాక మోదీ గురించి ఇప్పుడు అవే మాటలు అంటున్నాడు.

+  అన్నా.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు శ్రీ‌కాకుళం జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లిచ్చామన్నా.. ఇవి చాలవన్నట్లు మా నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్లుగా కొన్నాడు. మొత్తంగా జిల్లా నుంచి 8 స్థానాలు చేతిలో పెట్టుకొని జిల్లాకు ఏం చేశాడన్నా.. అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు.

+  సైకిలెక్కిన మా ఎమ్మెల్యే ఇసుక దందాలో బాగా సంపాదించారన్నా.. అని చెబుతున్నారు. ఇది సరిపోదన్నట్లు వంశధార నిర్వాసితుల పరిహారం కూడా బోగస్‌ పేర్లతో కొట్టేశాడన్నా.. అని చెప్పారు. వంశధార ప్రాజెక్టు గురించి చంద్రబాబు తన తొలి తొమ్మిదేళ్ల పాలనలో కనీసం ఆలోచన చేయలేదు. వైఎస్సార్‌ సీఎం అయ్యాక ఒడిశాతో వివాదమున్నా కూడా ఆ ప్రాజెక్టుకు సైడ్‌వియర్‌ కట్టి నీటిని తరలించేలా సింగిడి పాలాపురం రిజర్వాయర్‌ ను ప్రారంభించారు. రూ.930 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు పనుల్లో రూ.700 కోట్లు ఖర్చు చేసి ఉరుకులు పరుగులు తీయించారు. నాన్నగారు చనిపోయాక చంద్రబాబు వచ్చేసరికి కేవలం రూ.55 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ పూర్తి చేయలేదు. పైగా రూ.55 కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ.470 కోట్లకు పెంచారన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. కాంట్రాక్టర్‌ గా వారి బినామీ సీఎం రమేష్‌ కంపెనీ రిత్విక్‌ కు అప్పగించారు.

+  చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలు - పెట్రోలు - డీజిల్‌ రేట్లు - ఇంటి పన్నులు - స్కూలు - కాలేజీ ఫీజులు - ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌ కు మామూలు రోజుల్లో ఆర్టీసీ చార్జీ ఏసీ బస్సుకు రూ.1,352. అదే సంక్రాంతి వస్తే రూ.1,900 అవుతుంది. ఫీజు రీయింబర్స్‌ మెంటు పథకానికి పాతరేశారు. ఇంజినీరింగ్‌ చదువుకు ఏటా రూ.లక్షకు పైగా ఖర్చవుతుంటే ఈయన ఇస్తోంది రూ.35 వేలే. మిగతా డబ్బు కట్టడానికి పేదలు ఇళ్లు - ఆస్తులు - భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి.

+  చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన మాట.. జాబు రావాలంటే బాబు రావాలి అని. ఇంటికో ఉద్యోగం - లేక ఉపాధి ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల రూ.2 వేలు ఇస్తామన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. 55 నెలలు అంటే రూ.1.10 లక్షలు మీకు బాకీపడ్డాడు. ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే ఈ బాకీ గురించి అడగండి.

- బాబు వచ్చాడు.. 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా..

- గృహ నిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్‌ స్పెక్టర్లు - కంప్యూటర్‌ ఆపరేటర్లు 3500 మంది ఉద్యోగాలు గోవిందా.. 

- గోపాల మిత్రలు 1000 మంది ఉద్యోగాలు గోవిందా..

- 4500 మంది ఫీల్డు అసిస్టెంటు ఉద్యోగాలు గోవిందా..

- ఆయుష్‌ ఉద్యోగులు 800 మంది ఉద్యోగాలు గోవిందా..

- సాక్షర భారత్‌ సిబ్బంది 30 వేల మంది ఉద్యోగాలు గోవిందా..

- మధ్యాహ్న భోజన పథకంలోని 85 వేల మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలూ గోవిందా.. 

Tags:    

Similar News