మోడీ - కేసీఆర్ - బాబులకు భిన్నంగా జగన్

Update: 2019-06-07 07:01 GMT
అందరూ నాయకులు ఒకలా ఉండరు.. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మాత్రం ప్రస్తుత రాజకీయాల్లోనే చాలా నీట్ పాలిటిక్స్ కు అడుగులు వేస్తుండడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే.. దేశంలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేసి.. నేతలను లాగేసి బలపడాలని స్కెచ్ గీస్తుంటే.. వైఎస్ జగన్ మాత్రం కేవలం ప్రజాబలంతోనే బలపడాలని.. దేశంలో గొప్ప సీఎంగా నిలవాలని ఉబలాటపడుతున్నారు. ఈ నీట్ పాలిటిక్స్ ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ చంద్రబాబుకు కొండంత ఉపశమనం కలిగిస్తోంది. జగన్ నీతి - నిజాయితీకి ఇప్పుడు టీడీపీ పదికాలాల పాటు చీలిపోకుండా ప్రతిపక్షంలోనైనా మనుగ గలుగుతుందంటే అదంతా వైఎస్ జగన్ పెట్టిన దయా అని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు..

కేంద్రంలో బీజేపీ ఆపరేషన్ ప్రాంతీయ పార్టీలు మొదలుపెట్టింది.. బెంగాల్ లో తృణమూల్ నేతలను చేర్చుకుంటూ అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. కన్నడలో అధికార జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని కూల్చడానికి ఎత్తులు వేస్తోంది. తమిళనాట ఐటీ - ఈడీలతో అన్నాడీఎంకేను చెరబట్టింది. ఇలా తమ బలంతోపాటు ప్రతిపక్షాల బలహీనతలను ఆసరాగా చేసుకొని బీజేపీ బలపడుతోంది..

పక్కనున్న తెలంగాణలోనూ కేసీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ ను లేకుండా చేయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాగేస్తున్నారు. సీఎల్పీనే విలీనం చేశారు. ప్రతిపక్షాలను బలహీనం చేసి బలపడే ఎత్తుగడను కేసీఆర్ చేస్తున్నారు..ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసి ఆపార్టీని దెబ్బతీశారు.

నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా టీఆర్ ఎస్ ను చావుదెబ్బతీసి ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగారు. టీడీపీ సీనియర్ నేతలను లాగి చంద్రబాబును చెడుగుడు ఆడేశారు.. ప్రతిపక్షాలు బలహీనపడేందుకు వైఎస్ వేసిన ఎత్తులు పనిచేశాయి.

కానీ ఒకే ఒక్కడు వైఎస్ జగన్ మాత్రం ఈ ఆపరేషన్ ఆకర్ష్ లకు దూరంగా నీట్ పాలిటిక్స్ చేయడం సర్వాత్ర ప్రశంసలు కురిపిస్తోంది. తన పార్టీలోకి ఎవ్వరూ రావాలన్న ఎమ్మెల్యేలు - ఎంపీలు రాజీనామా చేసి రావాలంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన నేతలు ఆ సాహసం చేయడానికి వెనుకాడుతున్నారు. దీంతో జగన్ పార్టీలోకి వద్దామని టీడీపీ నేతలు ఉబలాటపడుతున్నా.. జగన్ కోరినట్టు వచ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రతిపక్షాన్ని లాగకుండా నీట్ పాలిటిక్స్ తో.. ప్రజాబలంతో ముందుకెళ్తున్న రాజకీయ నాయకుడిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

అదే సమయంలో ఇప్పటికే కునారిల్లిన టీడీపీ... వైఎస్ జగన్ నిర్ణయంతో బతికి బట్టకడుతుంది. దేశంలో ఏ రాజకీయ పార్టీతో పోలిక లేకుండా.. నాన్న వైఎస్ బాటకు కూడా విరుద్దంగా వెళుతున్న జగన్ నీట్ పాలిటిక్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమంటున్నారు. ఓడినా.. గెలిచినా అడ్డదారులు తొక్కని ఆయన నైజం నిజంగా ప్రశంసనీయమని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు.


Tags:    

Similar News