వీళ్ల లెక్క తేల్చాల్సిన టైమొచ్చింది జగన్

Update: 2020-11-01 11:10 GMT
రాజకీయ పార్టీలు అన్నాక నేతల మధ్య అధిపత్య పోరు సహజం. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు ఒకే పార్టీలో ఉంటే.. జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. పార్టీకి ఇలాంటి వారితో జరిగే నష్టం మామూలుగా ఉండదు. వీరి రాజకీయ ఉనికి కోసం తరచూ పార్టీని ఇరుకున పెడుతుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే ప్రకాశం జిల్లా చీరాలలోచోటు చేసుకుంది.

ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం బలరాం. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక.. ఇదే నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న అమంచి క్రిష్ణమోహన్ మధ్య అధిపత్య పోరు షురూ అయ్యింది. తరచూ ఈ ఇద్దరునేతలకు చెందిన క్యాడర్ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ మధ్య వైఎస్ జయంతి సందర్భంగా.. చీరాలలోని వైఎస్ విగ్రహానికి ఎవరు ఎప్పుడు దండలు వేసుకోవాలన్న విషయంలోనూ రచ్చ జరిగింది.

ఇలాంటివి తరచూ ఏదో ఒక గొడవలు జరగటం.. అధినాయకత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే..ఈ గొడవల తీవ్రత మరింత పెరిగే సంకేతాల్ని ఇచ్చే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో అమంతి.. కరణం వర్గీయుల మధ్య మొదలైన గొడవ ఘర్షణ రూపంలోకి వెళ్లటమే కాదు.. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.

ఇంత పెద్ద గొడవ ఎందుకు జరిగిందన్న లోతుల్లోకి వెళితే.. అధిపత్యాన్ని ప్రదర్శించాలన్న కరణం వర్గీయుల అత్యాశే అని చెప్పాలి. ఇక్కడ కరణం వర్గాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇలాంటి పనులే ఆమంచి వర్గీయులు కూడా చేస్తుంటారు కూడా. బలరాం పుట్టినరోజు సందర్భంగా అమంచి ఇంటి మీదుగా ర్యాలీ నిర్వహించటం వారిని రెచ్చగొట్టటం కాదా?

తమ ర్యాలీపై ఆమంచి వర్గీయులు వాటర్ బాటిళ్లు విసిరేశారని.. దాంతో ఘర్షణ మొదలైందని చెబుతున్నారు. ఈ తరహా ఉదంతాలు పార్టీకి ఏమాత్రం మంచివి కావు. రాంగ్ సిగ్నల్స్ వెళ్లటమే కాదు.. ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఉదంతాలే చోటు చేసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటం ఖాయం. అంతకంతకూ పెరుగుతున్న ఈ ఘర్షణల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ఇక లెక్కలు తేల్చేయాల్సిన సమయం అసన్నమైందని. కరణం - ఆమంచి ఇష్యూను ఇప్పటివరకు సీఎం జగన్ సీరియస్ గా తీసుకోలేదని చెబుతారు. ఇప్పటికైనా.. ఈ ఇష్యూను సెటిల్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. సీఎం జగన్ మరేం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News