జేసీ జోస్యం.. 2024లో సీఎం బాబేనట

Update: 2020-03-12 09:10 GMT
తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ రాజకీయవేత్త, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా పెద్ద సంచలమే. తనను నమ్ముకున్న వారి తో పాటు తానంటే ఓ గురి ఉన్న వారిని కూడా మెస్మరైజ్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంలో జేసీని మించిన వారే లేరని చెప్పాలి. అంతే కాకుండా ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్తు ఏమిటో చెప్పగలిగిన నేతల్లో జేసీ కూడా ఒకరని చెప్పక తప్పదు. అలాంటి జేసీ నోట ఇప్పుడు ఓ సంచలన వ్యాఖ్య వినిపించింది. 2024లో ఏపీ సీఎంగా మరోమారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పదవీ బాధ్యతలు చేపడతారని జేసీ జోస్యం చెప్పారు. చంద్రబాబు ఎదుటే ఈ వ్యాఖ్య చేసిన జేసీ..., చంద్రబాబుతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ వివరాల్లోకి వెళితే... బుధవారం సాయంత్రం చంద్రబాబు, జేసీల మధ్య ఓ ఆసక్తికర భేటీ జరిగిందట. ఈ భేటీలో చంద్రబాబు ప్రస్తావించిన పలు అంశాలపై ఏమాత్రం మొహమాటం లేకుండా చంద్రబాబు ఎదుటే తన మనసులోని మాటను జేసీ బయటపెట్టారట. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించనుందని, చంద్రబాబు సీఎంగా మరోమారు పదవీబాధ్యతలు చేపట్టడం ఖాయమని, అయితే అప్పటికి ఏపీ పూర్తిగా సర్వనాశనం అయిపోయి ఉంటుందని కూడా జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని సమర్థించిన చంద్రబాబు... మరికొన్నింటి తో విబేధించారట.

ఈ సందర్భంగా చంద్రబాబు, జేసీల మధ్య జరిగిన సంభాషణ విషయానికి వస్తే.. ప్రజల్లో మార్పు వచ్చిన మాట నిజమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించగా... మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు సార్ అంటూ జేసీ చమత్కరించారట. 2024లో మీరే మళ్లీ సీఎం అవుతారని జేసీ జోస్యం చెప్పారు. అయితే అప్పటికే రాష్ట్రం నాశనం అవుతుందని... మీరు సీఎం అయినా చేసేదేమీ ఉండదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిస్పందనగా చంద్రబాబు మాట్లాడుతూ, తాను బతికుండగా రాష్ట్రాన్ని నాశనం కానివ్వనని అన్నారు. నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తనకు 14 సంవత్సరాలు సీఎంగా, 11 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసే అవకాశం కల్పించారని... వారి రుణం తీర్చుకోవాల్సిందేనని చంద్రబాబు అన్నారట.
Tags:    

Similar News