కుల‌మే.. జేసీని కాపాడుతోందా?

Update: 2017-06-18 09:13 GMT
సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌ - మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన నేత‌ - ప్ర‌స్తుతం అనంత‌పురం పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డిది ఆది నుంచి దుడుకు స్వ‌భావ‌మే. నోటికి ఎంత వ‌స్తే... అంత మాట అనేయ‌డంలో ఆయ‌న ఏమాత్రం ముందూ వెనుకా చూసుకోరు. అస‌లు ఆయ‌న నోటికే అదుపు ఉండ‌దు. అనంత‌పురం జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న ఆయ‌న నోట నుంచి నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లే వ‌స్తుంటాయి. ఇక ఆయ‌న‌కు కోపం వ‌స్తే... ఎదుటి వారి ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే విష‌యం... మొన్న విశాఖ ఎయిర్ పోర్టులో, అంత‌కుముందు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో విమానయాన సిబ్బందిని అడిగితే తెలుస్తుంది. నోటికొచ్చిన‌ట్లుగా తిట్ట‌డం, చేతికందిన వ‌స్తువుల‌ను ధ్వంసం చేయ‌డం, అవ‌త‌లి వ్య‌క్తుల‌ను తోసేయ‌డం, దాడి చేయ‌డం వంటివ‌న్నీ క్ష‌ణ‌కాలంలో జ‌రిగిపోతాయి.

అధికార పార్టీ నేత‌, ఆపై పార్ల‌మెంటు స‌భ్యుడు కూడా అయిన ఆయ‌న కోపాన్ని చ‌ల్లార్చాలంటేనే ఏ ఒక్క‌రికి ధైర్యం చాల‌దు. మొన్న విశాఖ ఎయిర్‌ పోర్టులో జ‌రిగిందిదే. ఎయిర్ పోర్టుకు రావ‌డ‌మే ఆల‌స్యంగా వ‌చ్చిన ఆయ‌న త‌న‌ను లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో వీరావేశంతో ఊగిపోయారు. విమాన‌యాన సిబ్బందిపై బూతు పురాణం విప్పిన ఆయ‌న‌... అక్క‌డి బోర్డింగ్ పాసులిచ్చే మిష‌న్‌ ను ధ్వంసం చేసేశారు. దీంతో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విమాన‌యాన సంస్థ‌లు ఆయ‌న‌పై నిషేధాన్ని విధించాయి. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌పై టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కాస్తంత క‌టువుగానే వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరుంది.

అయితే జేసీ విష‌యంలో మాత్రం చంద్రబాబు అంత‌గా స్పందించిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. త‌న పార్టీ ఎంపీపై విమానయాన సంస్థ‌ల‌న్నీ నిషేధం విధించినా కూడా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు... నిన్న అనంత జిల్లా నేత‌ల‌తో స‌మీక్ష సంద‌ర్భంగా ఈ అంశాన్ని ప్ర‌స్తావించార‌ట‌. అది కూడా ఈ త‌ర‌హా ఘట‌న‌లు పున‌రావృతం కాకూడ‌ద‌న్న రీతిలోనే చంద్ర‌బాబు చెప్పారు త‌ప్పించి... పెద్ద‌గా హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌లేద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయినా జేసీపై చంద్ర‌బాబు అంత‌గా మెత‌క ధోర‌ణి అవ‌లంబించ‌డం వెనుక కార‌ణ‌మేమై ఉంటుంది? ఇదే కోణంలో ఆలోచించిన జాతీయ మీడియా అస‌లు కార‌ణాన్ని క‌నిపెట్టేసింది. జేసీ కుల‌మే ఆయ‌న‌ను కాపాడుతోంద‌ని, కుల స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకునే చంద్ర‌బాబు ఆయ‌న‌పై మెత‌క ధోర‌ణితో ముందుకు సాగుతున్నార‌ని జాతీయ మీడియాకు చెందిన ఓ ప్ర‌ముఖ ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం రాసింది.

ఏపీలో టీడీపీతో ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో పోటీ ప‌డుతున్న‌ది వైసీపీనే. ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సామాజిక వ‌ర్గానికే చెందినవారే జేసీ కూడా.  ఈ క్ర‌మంలో జేసీని, ఆయ‌న కుటుంబానికి త‌గినంత ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా... జ‌గ‌న్‌ ను కొంత మేర దెబ్బ‌తీయొచ్చ‌నేది చంద్ర‌బాబు భావ‌న‌. ఈ కార‌ణంగానే జేసీ ఎన్ని త‌ప్పులు చేసినా... ఎంత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నా... చంద్ర‌బాబు చూస్తూ ఊరుకుంటున్నార‌ని ఆ ప‌త్రిక త‌న క‌థ‌నంలో పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News