హైదరాబాద్ గొప్పా..? బెంగుళూర్ గొప్పా..?: కేటీఆర్ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం ఫైర్

Update: 2022-04-06 10:04 GMT
కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఇటీవల బెంగుళూర్ ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై ఫైర్ అయ్యారు. బెంగుళూర్ లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగుళూర్లో సదుపాయాలు లేకుంటే వందలాది స్టార్టప్ లు, పరిశోధనా సంస్థలు ఎందుకున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగుళూరు మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి గానీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దీంతో ఇరు రాష్ట్రాల నేతల మధ్య వార్ రోజురోజుకు ముదురుతోంది.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపార వేత్త బెంగుళూర్ లో నివసిస్తున్నాడు. అయితే ఇక్కడ పారిశుధ్యం బాగాలేదని, మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని ట్విటర్ లో పోస్టు చేశాడు. ఈ పోస్టుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అక్కడ సదుపాయాలు అంతగా బాగోలేనప్పుడు బ్యాగ్ సర్దుకొని హైదరాబాద్ కు వచ్చేయ్.. అని రీ ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్టు వైరల్ అయింది. అయితే దీనిపై కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించారు. ముందుగా ఓ మంత్రి స్పందిస్తూ కేటీఆర్ వ్యాఖ్యలు సరికావని ఫైర్ అయ్యారు. దీంతో ఇరువురి మధ్య ట్విట్టర్ వార్ సాగడంతో ఆ రాష్ట్ర సీఎం లైన్లోకి వచ్చారు.

ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఐటీ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఒక మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. దేశంలోకి వస్తున్న ఎఫ్ డీఐల్లో దాదాపు 40 శాతం కర్ణాటకలోకే వస్తున్నాయి.

వరుసగా మూడు త్రైమాసిక ఫలితాల్లో కర్ణాటకే నంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఈ సమయంలో బెంగుళూరుతో హైదరాబాద్ కు ఎలాంటి పోలిక లేదు. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బెంగుళూర్లో నివసించేందుకు వస్తున్నారు. అత్యధిక స్టార్టప్ లు, సంస్థలు బెంగుళూర్ లో ఏర్పడుతున్నాయి. మిలియన్లు, బిలియన్ డాలర్ల విలువైన అనేక కంపెనీలు నెలకొన్నాయి.' అని సీఎం అన్నారు.

ఇక ఇదే రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ స్పందించారు.అమెరికా, సింగపూర్ లాంటి దేశాలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. సిలికాన్ సిటీ పేరిట బెంగుళూర్ కు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందన్నారు.

ఈ సంగతి కేటీఆర్ తెలియదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల హైదరాబద్  మొదటి స్ఠానానికి రావడం లేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుడు నెంబర్ వన్ స్థానానికి వస్తుందన్నారు.
Tags:    

Similar News