ఇద్దరు చంద్రుళ్లకు అలా పంచ్ పడిందే

Update: 2016-03-21 04:35 GMT
తెలుగురాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి చాలామంది ఒక అంశాన్ని తరచూ ప్రస్తావిస్తుంటారు. పేరులోనే కాదు.. వారి వ్యవహారశైలి.. వారికి ఎదురయ్యే పరిస్థితులు అన్నీ విషయాల్లోనూ ఇద్దరు చంద్రుళ్లకు కుడి ఎడంగా ఒకేలా ఉంటాయన్న మాట ఉంది. సక్సెస్ లో కానీ.. ఫెయిల్యూర్ లో కానీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందన్న మాట వినిపిస్తుంటుంది.

తాజా బడ్జెట్ సమావేశాల్ని చూస్తే.. ఇద్దరు చంద్రుళ్లు చేజేతులారా విపక్షాల చేతిలో బుక్ అయ్యారని చెప్పాలి. తొలుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి  వస్తే.. విపక్షాన్ని కంట్రోల్ చేసే పనిలో భాగంగా.. మోతాదు మించిన కఠినంగా వ్యవహరించటం.. రోజా ఇష్యూలో తొందరపడినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కోర్టు తీర్పును గౌరవించి ఉంటే బాగుండేదన్న మాట జనసామ్యంలో బలంగా వినిపిస్తోంది.

ఒక మహిళా ఎమ్మెల్యే విషయంలో బాబు సర్కారు మరీ అంత కరుకుగా.. వ్యక్తిగత లక్ష్యమన్నట్లు వ్యవహరించటం ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. రోజా విషయంలో మరింత వర్క్ వుట్ చేసి ఉంటే బాగుంటుంది అన్న  మాట పలువురి నోట వినిపిస్తోంది. తాజా పరిణామాలు విపక్షానికి మైలేజీగా మారితే.. అధికారపక్షం ఇగోతో వ్యవహరిస్తుందన్న విమర్శను ఎదుర్కొంటున్న పరిస్థితి.

ఏపీ అసెంబ్లీ ఇలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలో పరిస్థితి మరోలా ఉంది. తమ బలం ముందు.. తమ మాటల చాతుర్యం ముందు విపక్షాలు తేలిపోవటం ఖాయమన్న ధీమా అధికారపక్షంలో బలంగా కనిపించింది. ఇది కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారిపోవటం.. ప్రత్యర్థిపై ఉన్న అంచనాలు తప్పు కావటం అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారింది.

వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా బడ్జెట్ లెక్కల విషయంలో విపక్షాల విమర్శలతో తెలంగాణ అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేయటంలో కేసీఆర్ సర్కారు సక్సెస్ అయ్యిందంటూ.. దానికి ప్రతిగా గణాంకాల్ని ఉదహరించటం అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు ముందున్న అంచనాలకు భిన్నమైన పరిస్థితులు తాజాగా చోటు చేసుకోవటం ఇద్దరు చంద్రుళ్లకు ఇబ్బందికరమనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News