చంద్రుళ్లు.. ఈ పుష్కర బాదుడేంది?

Update: 2015-07-12 23:13 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి పలువురి మనోభావాలు దెబ్బ తీసేలా ఉండటమే కాదు.. తీవ్ర నిరాశ కలిగించేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరికి వరాలు..మరికొందరికి వాతలన్నట్లుగా చంద్రుళ్ల ప్రభుత్వాలు వ్యవహరించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదారి బాదుడు.. గో‘దారి’ దోపిడీలా ఉందని మండిపడుతున్నారు.

పన్నెండేళ్లకు ఒక సారి వచ్చే గోదారి పుష్కరాల (ఈసారి పుష్కరాలు మామూలు పుష్కరాలని.. మహా పుష్కరాలుగా కొందరు చెబుతున్నారు. ఇలాంటి పుష్కరాలు 144 ఏళ్లకు ఒకసారి వస్తాయంటున్నారు. దీన్ని ఖండించే స్వామీజీలు ఉన్నారు) సందర్భంగా ప్రజారవాణా విషయంలో సాగుతున్న దోపిడీపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు.. రంజాన్ సందర్భంగా మైనార్టీలకు వరాల మీద వరాలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు.. అదే సమయంలో పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం నుంచి 63 శాతం మేర ఛార్జీలు పెంచటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈ వీర బాదుడేందన్న మాట వినిపిస్తోంది. ఆర్టీసీ బాదుడ్ని చూసిన ప్రైవేట్ వాహనదారులు సైతం ఛార్జీల్ని భారీగా పెంచేశారు. ప్రైవేటు బస్సు ఛార్జీల్ని భారీగా పెంచేసిన వారు.. ప్రైవేటు వాహనాలకు వసూలు చేసే మొత్తాన్ని ఓరేంజ్ లో పెంచేశారు. ఇప్పటివరకూ ఇన్నోవాకు కిలో మీటరకు రూ.10 వసూలు చేస్తుంటే.. పుష్కరాల స్పెషల్ అంటూ రూ.15 వసూలు చేస్తున్నారు.

ఎందుకిలా అంటే.. ఆర్టీసీ ఛార్జీల్నే ప్రభుత్వం పెంచగా.. పుష్కరాల సందర్భంగా ఆ మాత్రం పెంచకపోతే తమకు వర్క్ వుట్ కాదని చెబుతున్నారు. ఒక వర్గం వారి విషయంలో  ఒకలా.. ఇంకొకకరికి ఇంకోలా వ్యవహరించటం ఏమిటన్న ప్రశ్నలు జోరందుకున్నాయి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రుళ్లు ఒకేతీరులో వ్యవహరించటాన్ని ప్రశ్నిస్తున్నారు.

గోదావరి జిల్లాలతో పాటు విశాఖ.. విజయనగరం.. ఇటు వైపు కృష్ణా.. గుంటూరు.. ప్రకాశం జిల్లాల వారికి పెద్దగా భారం పడకున్నా.. దూర తీరాల నుంచి ప్రైవేటు వాహనాల్లో వచ్చే వారికి మాత్రం భారీ బాదుడు పడటం ఖాయమని చెప్పకతప్పదు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో ఈ బాదుడు తక్కువని చెప్పాలి. ఎందుకంటే.. వరంగల్ .. కరీంనగర్.. అదిలాబాద్.. ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉండటంతో.. ఆయా ప్రాంతాల వారు.. తమకు దగ్గర్లోని పుష్కర ఘాట్లకు వెళ్లే వీలుంది. కానీ.. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు.

కోట్లాది మంది సామాన్యులపై విపరీతమైన భారం పడే ఛార్జీల భారాన్ని తగ్గించే విషయంలో ఇద్దరు చంద్రుళ్లు ఆలోచించాలని.. బాదుడు నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ ప్రకటనలు ఇవ్వటంతో పాటు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. బండారు దత్తాత్రేయ లాంటి నేతలతో ఆర్టీసీ బాదుడు గురించి చెప్పి.. వాళ్లతో ఇద్దరు చంద్రుళ్లకు ఒక మాట చెప్పిస్తే.. పని కాకుండా ఉంటుందా? అయినా.. మైనార్టీలకు బహిరంగ ఇఫ్తార్ విందుల్నిభారీగా ఇచ్చే సర్కారు.. మిగిలిన వారందరి మీద అదనపు భారాన్ని మోపేందుకు ఎందుకు సిద్ధం అవుతున్నట్లు..? మైనార్టీల్లో ఉన్నదేమిటి? మిగిలిన వారిలో లేనిదేమిటో..?
Tags:    

Similar News