కేసీఆర్ స్టైల్‌...అది రాజ‌కీయం ఇది ప‌రిపాల‌న‌

Update: 2020-02-28 04:00 GMT
ఇటీవ‌లే సీఏఏ, ఎన్నార్సీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భ‌గ్గుమ‌న్న సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఏకంగా మంత్రివ‌ర్గ తీర్మానం చేశారు. అంతేకాకుండా ఈ చ‌ట్టాన్ని నిరసిస్తూ త్వ‌ర‌లో అసెంబ్లీలో తీర్మానం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, సీఏఏతో స‌మానంగా వివాదాస్పదంగా మారిన  జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) విష‌యంలో మాత్రం తెలంగాణ‌లో ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. హైద‌రాబాద్ నుంచి క్షేత్ర‌స్థాయి వ‌ర‌కూ శిక్ష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.


దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30లోగా జనాభా లెక్కల సేకరణను పూర్తిచేయాలని నిర్ణయించారు. జనగణనతో పాటే జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) వివరాలను కూడా నవీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు తెలంగాణ జనగణన విభాగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. జనాభా లెక్కల సేకరణ, ఎన్పీఆర్‌ కోసం జనగణన విభాగం అన్ని జిల్లాలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులను నియమించింది. జిల్లాలకు కలెక్టర్లు, కార్పొరేషన్లకు కమిషనర్లు ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. డివిజన్‌ స్థాయిలో ఆర్డీవోలు, మండలాలలో తాసిల్దార్లు ఆ బాధ్యతను నిర్వహిస్తారు. ఇదిలాఉండగా, జనగణన విభాగం రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తి చేసింది. జిల్లా స్థాయిలో శిక్షణ కొనసాగుతున్నట్టు తెలిసింది. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వనున్నారు.


జనగణన కోసం 31 రకాల ప్రశ్నావళి ఉండగా, ఎన్పీఆర్‌కు 23 ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నావళిని కేంద్రం త్వరలో విడుదల చేయనుంది. ఎన్యూమరేటర్లు జనాభా లెక్కలు, ఎన్పీఆర్‌ డేటా వివరాలను వేర్వేరుగా నమోదు చేయనున్నారు. ఈ రెండింటికి వేర్వేరుగా ఫారాలు ఉంటాయి. కాగా, తెలంగాణ‌  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే తేదీల ప్రకారం అధికారులు జనాభా లెక్కల సేకరణను చేపట్టనున్నారు. రాష్ట్రంలో పది సంవ‌త్స‌రాల క్రితం (2010లో) ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 10వ తేదీ వరకు జనగణన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉపయోగించనున్న నేపథ్యం లో ఈ ఏడాది కూడా వేసవి సెలవుల సమయంలోనే జనగణన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చ‌ట్టాన్ని, వివాదాస్ప‌ద అంశాన్ని వ్య‌తిరేకించ‌డం రాజ‌కీయ‌మ‌ని, ఆ ప్ర‌క్రియ‌ కు స‌హ‌క‌రించ‌డం ప‌రిపాల‌న అనే విధానాన్ని కేసీఆర్ కొన‌సాగిస్తున్న‌ట్లు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News