టీఆర్ఎస్ ఎంపీల‌తో భేటీలో కేసీఆర్ ఏం చెప్ప‌నున్నారంటే!

Update: 2022-07-16 03:45 GMT
జూలై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ జూలై 16న శ‌నివారం టీఆర్ఎస్ ఎంపీలతో కీలక స‌మావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీల‌తో టీఆర్ఎస్ అనేక అంశాల‌ను పంచుకుంటార‌ని చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై కేసీఆర్ ఇటీవ‌ల కాలంలో ఒంటి కాలితో లేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తార‌ని చెబుతున్నారు.

తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో పోరాడ‌టంతోపాటు బీజేపీ ప్ర‌భుత్వ విధానాల‌పై ధ్వ‌జ‌మెత్తాల‌ని ఎంపీల‌కు నూరిపోస్తార‌ని పేర్కొంటున్నారు. తెలంగాణ‌కు ఇవ్వాల్సిన నిధుల‌ను ఇవ్వ‌కుండా అడ్డుకోవ‌డం, తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఆప‌డానికి య‌త్నించ‌డం వంటివాటిపైన కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని కేసీఆర్ సూచిస్తార‌ని స‌మాచారం.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌పై కేంద్రాన్ని గ‌ట్టిగా ప్ర‌శ్నించాల‌ని ఎంపీల‌కు కేసీఆర్ చెబుతార‌ని తెలుస్తోంది. అలాగే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ప‌రిమితులు లేకుండా ఎంత పండిస్తే అంతా కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేయాల‌ని సూచిస్తార‌ని స‌మాచారం. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న రైతాంగ విధానాల‌ను దునుమాడాల‌ని ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని.. నిధుల మంజూరు విష‌యంలో ప‌క్ష‌పాతం చూపిస్తోంద‌ని.. దీన్ని పార్ల‌మెంటులో నిల‌దీయాల‌ని కేసీఆర్ ఎంపీల‌కు చెబుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల‌తో ఆర్థిక వ్య‌వ‌స్థ దిగ‌జారిపోతోంద‌ని.. అలాగే రూపాయి అంత‌కంత‌కూ ప‌త‌న‌మ‌వుతోంద‌ని.. దీనిపై కేంద్రాన్ని గ‌ట్టిగా ప్ర‌శ్నించాల‌ని ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తార‌ని చెబుతున్నారు.

కాగా ఇప్ప‌టికే కేసీఆర్ వివిధ రాష్ట్రాల విప‌క్ష ముఖ్య‌మంత్రుల‌తో, పార్టీ అధినేత‌ల‌తో ఫోన్ లో చ‌ర్చించారు. విప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా పార్ల‌మెంటు స‌మావేశాల్లో బీజేపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేయాల‌ని కేసీఆర్ కోరారు. స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ స‌న్నిహితులు, త‌దిత‌రుల‌తో ఇప్ప‌టికే కేసీఆర్ సంభాషించారు. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు వేడెక్క‌నున్నాయి.
Tags:    

Similar News