దళిత బంధు కాదు.. ఇక ‘అందరి బంధు’!

Update: 2021-10-19 04:01 GMT
ఎత్తులు వేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రావీణ్యాన్ని తక్కువ చేసి చూడటానికి ఏ మాత్రం సాధ్యం కాదు. ఎప్పుడు ఏ విషయం చెప్పాలి? ఎలా ప్రజల మూడ్ ను మార్చాలన్న విషయంపై ఆయనకున్న పట్టు అంతా ఇంతా కాదు. తాజాగా మరోసారి ఆయన తన మేజిక్ ను ప్రదర్శించారని చెప్పాలి. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన దళితబంధుపై బోలెడంత చర్చ జరుగుతోంది. దళితుల్లో మాత్రమే పేదలు ఉన్నారా? మిగిలిన వర్గాల్లో పేదలు లేరా? వారేం పాపం చేశారు? దళితబంధు దళితుల్లోని ప్రతిఒక్కరికి.. అంటే ప్రభుత్వ ఉద్యోగితో సహా అందిస్తామని చెప్పిన కేసీఆర్ మీద విమర్శలు వచ్చాయి.

అలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన వ్యాఖ్యల్ని చూస్తే.. ఇప్పటివరకు అమలవుతున్న దళితబంధు.. రానున్న రోజుల్లో అందరిబంధును చేయటానికి వీలుగా కేసీఆర్ ప్లానింగ్ అన్నది అర్థమవుతుంది. ఈ వాదనకు బలం చేకూరేలా కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

‘ఎంతో గుండె ధైర్యంతో తెలంగాణ సాధించాం. ఇప్పుడు అదే దమ్ముతో ఎంత ఖర్చైనా వెనుకాడకుండా దళితబంధు పథకం అమలు చేస్తున్నాం. దానిని సంపూర్ణంగా విజయవంతం చేస్తాం. దయనీయస్థితిలో ఉన్న బలహీన వర్గాలను ఆదుకోవటానికి తెచ్చిన ఈ పథకాన్ని.. నా ప్రాణం పోయినా ఆపేది లేదు. ఒక్క దళితబంధుతోనే ఆగిపోం. బీసీలు.. గిరిజనులు.. మైనార్టీలు.. ఈబీసీ.. ఇతర వర్గాల పేదలకు కూడా వర్తింపజేస్తాం. దళిత బంధుకు రూ.1.73 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. వచ్చే ఏడేళ్లలో ఇతర వర్గాలకు రూ.23లక్షల కోట్ల సంపద పంచుతాం’’ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే.. దళితబంధు పథకాన్ని ఇతర వర్గాలకు అమలు చేస్తామన్న విషయాన్ని చెప్పేసినట్లేనని చెప్పాలి.

దళితబంధు టీఆర్ఎస్ సర్కారు ప్లాగ్ షిప్ ప్రోగ్రాంగా మారటమే కాదు.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ పథకం మీద ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇలాంటివేళ.. ఈ పథకాన్ని మరింత విస్తరించేలా చేయటం ద్వారా.. దీన్ని వ్యతిరేకించే వర్గాలకు కొత్త ఆశలు కలిగించేలా చేయటంతో పాటు.. వ్యతిరేక గొంతులకు తాజా తాయిలంతో తాళం వేయాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. దీంతో.. దళితబంధుపై గుర్రుగా ఉన్న వారు కేసీఆర్ తాజా ప్రకటనతో విమర్శలకు చెక్ పడే అవకాశం ఉందంటున్నారు. దళితబంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికకు వరం కాదు శాపంగా మారుతుందన్న అంచనాలు సైతం తాజా ప్రకటన మారేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. దళితబంధు కాస్తా అందరిబంధు చేయాలన్న కేసీఆర్ వ్యాఖ్య కీలకంగా మారనుంది. ఇది తెలంగాణ రాజకీయ సమీకరణల్ని సైతం మారుస్తుందనటంలో సందేహం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.




Tags:    

Similar News