కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ ఈ రోజుతో స‌మాప్తం!

Update: 2018-07-20 05:37 GMT
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ.. అత్య‌ధిక కాలం పాలించిన కాంగ్రెస్ రెండు మాత్ర‌మే పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టాలా?  ఇంకెవ‌రికి అవ‌కాశం ఇవ్వరా?  అయితే.. కాంగ్రెస్ కాదంటే బీజేపీనేనా?  ప్ర‌త్యామ్నాయం లేదా?  అంటూ గ‌ళం విప్పట‌మే కాదు.. థ‌ర్డ్ ప్రంట్ క‌ల‌ల్ని ఆవిష్క‌రించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి త‌మ థ‌ర్డ్ ఫ్రంట్ ఆలోచ‌న‌ల‌కు ఒక కొలిక్కి తీసుకొస్తాన‌ని.. జాతీయ స్థాయిలో ప‌లు ప్రాంతీయ పార్టీల‌తో జ‌ట్టు క‌డ‌తానంటూ చెప్పిన కేసీఆర్‌.. త‌న మాట‌కు త‌గ్గ‌ట్లే కొన్ని రాష్ట్రాల‌కు ప్ర‌యాణం చేయ‌టం తెలిసిందే. ప్ర‌త్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకొని మ‌రీ ప‌లు రాష్ట్రాల్లోని పార్టీ అధినేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌.. జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం రేపారు.

థ‌ర్డ్ ప్రంట్ పై ఎంత హ‌డావుడి చేశారో.. త‌ర్వాతి కాలంలో అంత కామ్ గా ఉంటున్న కేసీఆర్‌.. ఈ రోజుతో థ‌ర్డ్ ఫ్రంట్ మాట‌ల‌కు ప్యాక‌ప్ చెప్పేయ‌టం ఖాయ‌మంటున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఓవైపు థ‌ర్డ్ ఫ్రంట్ మాట‌లు చెబుతూనే మ‌రోవైపు ప్ర‌ధాని మోడీతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లుగా చెబుతారు. దీనికి త‌గిన ఆధారాలు ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేద‌ని చెప్పాలి.

కాకుంటే.. కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు మోడీ స‌సేమిరా అనే ప‌రిస్థితి నుంచి.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సైతం సునాయాసంగా మోడీ అపాయింట్ మెంట్ ద‌క్కించుకొని ఆయ‌న‌కు విన‌తిప‌త్రాలు అంధజేసే స్థాయిలోకి వెళ్లిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదంతా కూడా మోడీ మాష్టారితో కేసీఆర్ కు ఉన్న స‌న్నిహిత సంబంధాల కార‌ణంగానే ఇలాంటివి చోటుచేసుకుంటున్న‌ట్లుగా చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ మాట‌లు ఈ రోజుతో చెల్లిపోతాయ‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. థ‌ర్డ్ ఫ్రంట్ ఆలోచ‌న‌కు ఊపిరి పోసిన కేసీఆర్‌.. అందుకు త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌కుండా మోడీ ప‌ట్ల పాజిటివ్ గా ఉండ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపిస్తున్న‌దే. ఈ రోజు లోక్ స‌భ‌లో జ‌రిగే అవిశ్వాస తీర్మానంలో థ‌ర్డ్ ఫ్రంట్ నేత‌గా అధికార‌ప‌క్షాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించాలి. కానీ.. కేసీఆర్ మాత్రం మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌న్న ఆలోచ‌న‌లో లేన‌ట్లుగా తెలుస్తోంది. అవిశ్వాసంపై ఓటు వేయాల్సి వ‌స్తే.. మోడీకి అనుకూలంగా ఓటు వేయాలా?  వ్య‌తిరేకంగా ఓటు వేయాలా?  త‌ట‌స్థంగా ఉండాల‌న్న దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు సాగుతున్నాయి. మొత్తంగా అప్ప‌టికి ఏది మంచిది అనిపిస్తే అది చేసేయండ‌న్న సిగ్న‌ల్ తో లోగుట్టుగా పార్టీ నేత‌లు ఏం చేయాలో ఇప్ప‌టికే చెప్పేశార‌ని చెబుతున్నారు. మోడీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన త‌ర్వాత థ‌ర్డ్ ఫ్రంట్ అన్న మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే వీలుండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News