కేసీఆర్ మాటః తెలంగాణ గొప్ప జాతి

Update: 2016-07-08 16:20 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత ఆయ‌న జాతి గురించి ప్ర‌స్తావిస్తూ  తెలంగాణ గొప్ప జాతి అని కొనియాడారు. ఉద్యమం ద్వారా ప్రజలు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తీరు అమోఘమని అన్నారు. ఊహించని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్న ఘ‌న‌త తెలంగాణ జాతిద‌ని చెప్పారు.

హ‌రిత‌హారం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా న‌ల్ల‌గొండ జిల్లాలో కేసీఆర్ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాను ఉద్యమం ప్రారంభించినపుడు పిడికెడు మంది అంటూ వ్యాఖ్యానించార‌ని అన్నారు. తెలంగాణ వస్తదని దేశంలో ఎవరూ ఊహించలేదని తెలిపారు. జట్టు కడితే ఏం జరుగుతుందో నిరూపించిన ఘనత తెలంగాణ జాతిదని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో హరితహారాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పచ్చగా మార్చడానికి మనం కంకణం కడితే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమేనని పేర్కొన్నారు. పట్టుబట్టి హరిత తెలంగాణను సాధిద్దామన్నారు. వానలు కొనుక్కుంటే దొరికేవి కావని - పచ్చని అడవులు పెంచితేనే వర్షాలు కురుస్తాయని కేసీఆర్‌ వివరించారు. ఇకపై తెలంగాణలో కరెంట్ కోతలుండవని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ అద్భుతంగా అమలు చేస్తున్నామని వివరించారు.

నల్లగొండ జిల్లాలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉందని కేసీఆర్ అన్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్ప‌ష్టం చేశారు. జిల్లాలో అతి తక్కువ అడవులు ఉన్నాయని, పచ్చదనం తక్కువగా ఉంది కాబట్టే ఇక్కడ నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. తాను నల్లగొండకు రావడంలో ఉద్దేశ్యం కూడా అదేనని అందరిని ప్రోత్సహించి జిల్లాలో అడవుల శాతాన్ని వచ్చానని వివరించారు. హరితహారంలో నల్లగొండ జిల్లాను ప్రజలు అగ్రస్థానంలో ఉంచుతారనే ఆశిస్తున్నానన్నారు. సభ నుంచి తిరిగి వెళ్తూ హెలికాప్టర్ ద్వారా జాతీయ రహదారి వెంట ఏరియల్ సర్వే ద్వారా హరితహారం కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు.
Tags:    

Similar News