ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే సీట్ల లెక్క చెప్పిన కేసీఆర్

Update: 2022-09-04 04:55 GMT
షెడ్యూల్ ప్రకారం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగటానికి మరో ఏడాది మూడు నెలల టైం ఉంది. కానీ.. రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం చూస్తే మాత్రం.. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసినట్లుగా పరిస్థితి ఉంది. మరికొద్ది నెలల్లో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ కదుపుతున్న పావులు.. అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న చందంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. కమలనాథులకు కౌంటర్లు ఇచ్చేందుకు గులాబీ బాస్.. ఆయన కుమారుడు.. మేనల్లుడు శక్తి మేర ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో.. రాజకీయ వాతావరణం వాడివేడిగా మారింది. కేసీఆర్ మాట ఎత్తితే చాలు.. కస్సుమంటున్న కమలనాథుల తీరుతో తెలంగాణలో సరికొత్త రాజకీయ చిత్రం ఆవిష్క్రతమవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ.. టీఆర్ఎస్ తీరుపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్ల సంగతిని పక్కన పెడితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధుల్లో సరికొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటివేళ.. అలాంటి విషయాలపై క్లారిటీ ఇవ్వటంతో పాటు.. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో వెలువడే ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు టీఆర్ఎస్ అధినేత కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. శనివారం ప్రగతిభవన్ లో మంత్రివర్గ సమావేశం.. అనంతరం టీఆర్ఎస్ భవన్ లో పార్టీ శాసన సభాపక్ష సమావేశాలు జరిగాయి. ఈ రెండు సమావేశాల్లో కేసీఆర్ కీలక అంశాల్ని ప్రస్తావించారు. పార్టీ కీలక నేతల్ని మోటివేట్ చేసేలా.. తెలంగాణలో తమ బలం ఏ మాత్రం చెక్కు చెదర్లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు. తాను వారందరికి తోడుగా ఉంటాన్న ధీమాను వ్యక్తం చేస్తూ.. ఫ్యూచర్ కూడా టీఆర్ఎస్ దే  అన్న విషయాన్ని స్పష్టం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

 బీజేపీ దూకుడుతో కొత్త సందేహాల్లోకి వెళుతున్న గులాబీ ముఖ్యనేతల ఆలోచనల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పార్టీకి ఉన్న సానుకూలాంశాల్ని తెలియజేసేలా ఆయన ప్రసంగం ఉండటం గమనార్హం. ''ఈడీ.. బీడీలు మనల్నేం చేయలేవు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు బీజేపీ ఇక్కడ చేద్దామనుకుంటే కుదరదు.బీజేపీ మత పిచ్చి రాజకీయాల్ని చేస్తోంది. దాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి. సీబీఐతో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. మీ వద్దకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. బెదిరింపులకు పాల్పడతారు. మహారాష్ట్రలో శివసేన మాదిరి చేయాలని ప్రయత్నిస్తారు. ఇక్కడ అంతా నిజాయితీగా ఉన్నారు. తెలంగాణలో వారి ఆటలు సాగవు'' అని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 70 నుంచి 80 సీట్లు టీఆర్ఎస్ కే వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో బాగా కష్టపడితే 90 సీట్లు మనవేనని.. ఇదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నట్లు చెప్పటం విశేషం. ఈ సందర్భంగా కేసీఆర్ నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి వచ్చింది.''మిమ్మల్నందర్నీ గెలిపించుకునే బాధ్యత నాది. అంతా గట్టిగా ఉండాలి. ఎలాంటి  బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగాల్సిన పని లేదు. అయితే జనంలో లేకుండా ఉంటే మాత్రం కుదరదు. ఎవరూ హైదరాబాద్‌లో ఉండొద్దు. ఇక్కడ మీకు పనిలేదు. నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్లి పని చేయాలి. జనంలో ఉండాలి'' అంటూ దిశానిర్దేశం చేశారు. మొత్తానికి టీఆర్ఎస్ కు తిరుగు లేదన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే కన్నా.. వారికి నమ్మకం కుదిరేలా ఆయన మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. చూస్తుంటే.. బీజేపీ చురుకు కసీఆర్ కు ఎంతలా ఉందన్న విషయం తాజాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News