జగన్ సర్కారు కేబినెట్ తాజా నిర్ణయాలు ఏమంటే?

Update: 2020-08-19 11:50 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఉంటుందని చెప్పాలి. తన తండ్రి మాదిరి.. కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. ఒక్కొక్క అంశంపై చర్చ.. వేగంగా నిర్ణయాలు తీసుకోవటం ఆయనకు అలవాటు. కేసీఆర్ మాదిరి గంటల తరబడి మంత్రివర్గ సమావేశాన్నినిర్వహించటం.. మిగిలిన వారిని శ్రోతల్ని చేసి.. తాను చెప్పాల్సిన విషయాల్ని నాన్ స్టాప్ గా చెప్పే అలవాటు ఏపీ సీఎం జగన్ లో చాలా తక్కువ. ఎజెండాలో పేర్కొన్న అంశాల మీద చర్చ జరపటం.. తానుఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటే ఇవ్వటం.. లేదంటే.. టేబుల్ లో పేర్కొన్న అంశాల వారీగా నిర్ణయాలు తీసుకోవటం ఉంటుందని చెబుతారు.

తాజాగా ముగిసిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవటం ద్వారా.. తాము హామీ ఇచ్చినట్లుగా పలు సంక్షేమ పథకాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావించే నవరత్నాల్లోని మరోకీలక అంశానికి వాయిదా వేశారు. ఇంతకీ ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ తీసుకున్న నిర్ణయాల్లోకి వెళితే.. 

-  నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర.  వైయస్సార్‌ ఆసరాకు ఓకే.  ఏప్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ  డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించే సౌకర్యం. దాదాపు 90 లక్షల మంది లబ్థిదారులు ఉన్నారు. నాలుగు సంవత్సరాల్లో రూ. 27,169 కోట్ల మొత్తాన్ని అక్కచెల్లమ్మల చేతికివ్వనున్నారు. 2020–21 సంవత్సరానికి రూ.6792.21 కోట్లు ఇవ్వనున్నారు. 

-  సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి ఆమోదం. దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి. ఈ పథకంలో భాగంగా మూడు జతల యూనిఫారమ్, నోటుబుక్స్, టెక్ట్స్‌బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ విద్యా కానుక కింద పంపిణీ. విద్యా కానుక కోసం రూ.648.09 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

-  సెప్టెంబరు 1న వై.యస్‌.ఆర్‌. సంపూర్ణ పోషణ్‌ ప్లస్, సంపూర్ణ పోషణ్‌  ప్రారంభం. 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ అమలు.  గర్భవతులకు, బాలింతలకు, 6 నుంచి 36 నెలల వరకు, అలాగే 36 నుంచి 72 నెలల పిల్లలకు  పౌష్టికాహారం. ఈ కార్యక్రమాలకు ఏడాదికి రూ.1863 కోట్లు. దీంతో 30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

-  గతంలో కేవలం రక్తహీనతతో ఉన్న గర్భవతులకు, బాలింతలకు మాత్రమే ఆహారం అందించగా... ఇప్పుడు అందరు బాలింతలకు, గర్భవతులకు అందిస్తారు. గత ప్రభుత్వ కాలంలో రూ.762 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వ కాలంలో మూడు రెట్లు పెంచి దాదాపు రూ.1863 కోట్లు కేటాయిస్తున్నారు.

-  డిసెంబరు 1నుంచి లబ్దిదార్ల ఇళ్లకే నాణ్యమైన బియ్యం అందించేలా చర్యలు. ఇందుకోసం 9260 వాహనాలు కొనుగోలు. అందుకు అవసరమైన రుణాలు తీసుకునేందుకు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ. నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగిస్తారు.
-  60శాతం సబ్సిడీ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు.  వాహనాల కోసం లబ్ధిదార్లు 10 శాతం చెలిస్తే చాలు. 30 శాతం బ్యాంకు రుణం కాగా 60 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. నిరుద్యోగులైన యువకులకు ఆరేళ్ల పాటు ఈ కాంట్రాక్టు ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి నెలా రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి మార్గం. ఇందుకోసం ఏటా రూ.550 కోట్లు ఖర్చు.

 -  పర్యావరణ హితంగా ఉండే 10 కేజీలు, 15 కేజీలు  రీయూజబుల్‌  బ్యాగులు లబ్దిదార్లకు ఇవ్వనున్న ప్రభుత్వం. మొత్తం సార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు వ్యయం. డోర్‌ డెలివరీకి రూ.296 కోట్లు వ్యయం చేయనున్న ప్రభుత్వం దీంతో.. అదనంగా రూ.776 కోట్లు ఖర్చు చేయనుంది.

-  వై.ఎస్‌.ఆర్‌.బీమా కింద సామాజిక భద్రతా పథకం. సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు.  శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు. బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే వర్తించనున్న వై.యస్‌.ఆర్‌. బీమా. రాష్ట్రంలో సుమారు 1కోటి 50 లక్షల బియ్యంకార్డు కుటుంబాలు.

- ఎల్‌ ఐ సి, కేంద్ర ప్రభుత్వం  గత పథకాన్ని ఉపసంహరించిన నేపధ్యంలో ఈ కొత్త పథకాన్ని సొంత ఖర్చుతో  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకానికి ఏడాదికి రూ.583.5 కోట్లు ఖర్చు చేయనున్నారు.

-  చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరు. వై.ఎస్‌.ఆర్‌ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్‌ పోస్టులు, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు.

- విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో అదనంగా 2 యూనిట్లు. 115 మెగావాట్లు చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. దాదాపు రూ.510 కోట్లు వ్యయంతో ఏర్పాటు.

-  వై.ఎస్‌.ఆర్‌ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఓకే. పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం. రాయచోటిలో కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు.

- వై.యస్‌.ఆర్‌ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం

-  నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్‌ పచ్చజెండా. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో  బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు. 2000 ఎకరాల్లో ఏర్పాటు కానున్న బల్క్‌ డ్రగ్‌ పార్క్‌. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ తో రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయన్న అంచనా. దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం. భారీగా ఉపాధి అవకాశాలు

-  ఏపీఐఐసీ కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ బల్క్‌ డ్రగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీబీడీఐసీ) ఏర్పాటు. వై.ఎస్‌.ఆర్‌ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం. రూ. 10వేల కోట్లు పెట్టుబడులతో పాటు.. లక్ష మందికి ఉపాధికి అవకాశం. క్లస్టర్ల మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.730 కోట్లు ఖర్చు

- భావనపాడు పోర్టు కోసం రైట్స్‌ కంపెనీ డీపీఆర్‌కు కేబినెట్‌ అంగీకారం. ఫేజ్‌ –1 కే దాదాపు రూ. 3669.95 కోట్లు ఖర్చు .  శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చనున్న పోర్టు. ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు. తొలి దశలో భాగంగా 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హేండిలింగ్‌ చేయాలన్న లక్ష్యం. 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హేండలింగ్‌ లక్ష్యం

-  ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ సీడ్‌( క్వాలిటీ కంట్రోల్‌ ) యాక్టు– 2006 సవరణలపై ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఓకే.
Tags:    

Similar News