లాక్ డౌన్ లో పెళ్లి అవసరమా ..కిషన్ రెడ్డి!

Update: 2020-04-17 13:10 GMT
యువ హీరో నిఖిల్ పెళ్లి విషయం పై  ఇప్పుడు దేశ వ్యాప్తంగా  చర్చ నడుస్తుంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి - లాక్ డౌన్ ను విధించారు. ఈ లాక్ డౌన్ ను మన దేశమే కాదు ..యావత్ ప్రపంచమే అమలు చేస్తుంది. ప్రపంచంలోని మెజారిటీ దేశాలు కరోనా కట్టడి కోసం మరో మార్గం లేకపోవడంతో ..లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక రంగం కోలుకోలేని విదంగా దెబ్బతిన్నది. అనేక రంగాలపై ఈ కరోనా ప్రభావం కనిపిస్తుంది. అలాగే, ఈ మహమ్మారి దెబ్బకి దేశ వ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.

అయితే , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు - మాజీ ప్రధాని  దేవెగౌడ మనవడు అయిన హీరో నిఖిల్ వివాహాన్ని మాత్రం మాజీ సీఎం ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే ఏప్రిల్ 17 న అతికొద్ది మంది బంధువుల మధ్య జరిపించారు. అయితే , పెళ్లిలో లాక్‌ డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కిన విషయం తెలిసిందే.  దీనితో ఇప్పుడు ఈ పెళ్లి పై అనేక మంది స్పందిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేయకపోతే ఏమౌతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజాగా ఈ వివాహం పై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ - మాజీ సీఎం కుమారస్వామి  లాక్‌ డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర సమయంలో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. కరోనాపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 20మందిని మించి గుమికూడదన్న విషయాన్ని గుర్తు చేశారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన వారే నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరం అని అన్నారు. తన తల్లి సంవత్సరికం కార్యక్రమాన్ని కూడా ఆన్‌ లైన్‌ ద్వారా తాను ఒక్కడినే నిర్వహించుకున్నానని - లాక్‌ డౌన్‌ నిబంధలు ప్రజా ప్రతినిధులే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.

Tags:    

Similar News