కేసీఆర్ వియ్యంకుడి పేరు చెప్పి భారీ దందా

Update: 2017-07-07 07:08 GMT
మంచిర్యాల జిల్లా ల‌క్సెట్టిపేట్ మండ‌లం చందారంలో ఓ వ్య‌క్తి  తెలంగాణ సీఎం కేసీఆర్ వియ్యంకుడి పేరు చెప్పి జ‌నాల నుంచి భారీగా డ‌బ్బులు వ‌సూలు చేసి అడ్డం తిరిగాడు.  ఏ ప‌ని కావాల‌న్నా చేయిస్తాన‌ని చెప్పి చివ‌ర‌కు హ్యాండివ్వ‌డంతో జ‌నం ఇచ్చిన డ‌బ్బులు తిరిగి అడిగారు.. దీంతో... న‌న్నే అడుగుతారా... శాల్తీలు లేపేస్తా..నేను త‌లుచుకుంటే మీరు భూమి మీద ఉండ‌రు.. అంటూ బెదిరింపుల ప‌ర్వానికి తెర‌దీశాడు.

కేసీఆర్ వియ్యంకుడు... మంత్రి కేటీఆర్ కు మామ అయిన‌ హ‌ర‌నాథ‌రావు త‌న‌కు బాగా క్లోజ్ అని.. ఆయ‌నతో చెప్పించి.. మీకు ఉద్యోగాలిప్పిస్తా..! ఇసుక కాంట్రాక్టులు ఇప్పిస్తా..! నేను ఏం చెబితే అదే వేదం..! కానీ కొంచెం ఖ‌ర్చ‌వుతుంది.. ఒక్కొక్క‌రు రెండు మూడు ల‌క్ష‌లు ఇవ్వాలంటూ చందారానికి చెందిన కొమిరెడ్డి మ‌ల్లారెడ్డి సుమారు 90 ల‌క్ష‌లు వ‌సూలు చేశాడు. సొంతూరిలో కొంద‌రి నుంచి, పొరుగునే ఉన్న జిగిత్యాల జిల్లాకు చెందిన కొంద‌రి నుంచి వ‌సూలు చేశాడు. ఇసుక కంట్రాక్టులు, ఉద్యోగాలలిప్పిస్తానంటూ దందా మొద‌లుపెట్టాడు.

అయితే... డ‌బ్బులిచ్చినా ప‌నులు కాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన జ‌నాలు.. త‌మ డ‌బ్బులు త‌మ‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. మ‌ల్లారెడ్డిని నిల‌దీశారు. అంతే రెచ్చిపోయిన మ‌ల్లారెడ్డి త‌న విశ్వ‌రూపం చూపించాడు. తుపాకీ తెచ్చి.. కొంద‌రు బౌన్స‌ర్ల‌ను కూడా వెంటేసుకుని వ‌చ్చి బెదిరించాడు. దీంతో బాధితులంతా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు  మ‌ల్లారెడ్డితో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు.

కాగా మ‌ల్లారెడ్డి గ‌తంలోనూ ఇలాగే వ‌సూళ్లు చేసి దొరికాడు. గ‌తంలో జెన్ కో లో ఉద్యోగాలిప్పిస్తాన‌ని మోసం చేసి జైలుకు వెళ్లాడు.  కేటీఆర్ మామ త‌న‌కు తెలుస‌ని న‌మ్మించేందుకు గ్రామ పాఠ‌శాల ప్ర‌హారీ గోడ నిర్మాణానికి ఆయ‌న్నుఊరికి తీసుకొచ్చాడు. ఆయ‌న‌తో క్లోజ్‌ గా క‌నిపించి జ‌నాల‌ను న‌మ్మించాడు. అయితే... మ‌ల్లారెడ్డి పిల‌వ‌గానే హ‌ర‌నాథ‌రావు ఎందుకొచ్చాడ‌న్న‌దే చాలామందికి అర్థం కాని ప్ర‌శ్న‌. మ‌రి ఆయ‌న‌కు ఏం మాయ‌మాట‌లు చెప్పి న‌మ్మించాడో.
Tags:    

Similar News