కుప్పం నుంచి లోకేష్‌..క‌ల్యాణ‌ దుర్గానికి మారుతున్న బాబు

Update: 2018-11-27 11:50 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేయ‌డం దాదాపుగా ఖాయ‌మైంది. ద‌శాబ్దాలుగా త‌న తండ్రికి ఎదురులేకుండా ఉన్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కుమారుడికి ఆ స్థానాన్ని ఇచ్చేయ‌నున్న చంద్ర‌బాబు అనంత‌పురంలోని ఓ కీల‌క నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుతోంది.

కుప్పంలో టీడీపీకి తిరుగులేదు. చంద్ర‌బాబు గ‌త ఆరు ద‌ఫాలు అక్క‌డి నుంచే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక లోకేష్ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఎమ్మెల్సీగా ఉండి ఆయ‌న‌ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న స్వ‌యంగా పోటీకి దిగ‌నున్నారు. త‌న రాజ‌కీయ వారసుడు కుమారుడు లోకేషేన‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికే సంకేతాలిచ్చారు. కుమారుడికి త‌న కుప్పం స్థానాన్ని ఇవ్వ‌డం ద్వారా ఈ విష‌యాన్ని మ‌రింత స్ప‌ష్టీక‌రించాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కుప్పం అభివృద్ధిపై లోకేష్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.

మ‌రి కుప్పంను వీడితే చంద్ర‌బాబు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌శ్న త‌లెత్త‌క‌మాన‌దు. అయితే - తాను పోటీ చేసే స్థానంపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు ఓ క్లారిటీకి వ‌చ్చేశార‌ట‌. టీడీపీకి గ‌ట్టి ప‌ట్టు ఉన్న అనంత‌పురం జిల్లాను అందుకు ఎంచుకున్నార‌ట‌. అనంత‌పురంలోని క‌ల్యాణ‌ దుర్గం స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. కొన్ని నెల‌లుగా చంద్ర‌బాబు అనంత‌పురంలో వ‌రుస‌గా ప‌ర్య‌టిస్తుండ‌టం - జిల్లా అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి సారించ‌డం కూడా కల్యాణ‌దుర్గం నుంచి ఆయ‌న పోటీ చేస్తార‌ని బ‌ల‌మైన సంకేతాలిస్తున్నాయి. వాస్త‌వానికి గుంటూరు - కృష్ణా జిల్లాల్లో ఓ స్థానం నుంచి పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు తొలుత భావించారని.. చివ‌ర‌కు క‌ల్యాణ‌దుర్గం కే మొగ్గు చూపార‌ని తెలుస్తోంది. అయితే - ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ర‌ఘువీరా రెడ్డి 2009 - 2014 ఎన్నిక‌ల్లో క‌ల్యాణ‌దుర్గం నుంచే పోటీ చేశారు. 2009లో విజ‌యం సాధించిన ర‌ఘువీరా.. 2014లో ప‌రాజ‌యం పాల‌య్యారు. మ‌రి టీడీపీ-కాంగ్రెస్ పొత్తు నేప‌థ్యంలో ఆయ‌న చంద్ర‌బాబుకు క‌ల్యాణ‌దుర్గం స్థానాన్ని త్యాగం చేస్తారా? లేదా? అనే విష‌యం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

చంద్ర‌బాబు అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో హిందూపురం నుంచి బాల‌కృష్ణ మ‌ళ్లీ పోటీ చేసే అవ‌కాశాల‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇద్ద‌రు బ‌డా నేత‌లు ఒకే జిల్లా నుంచి పోటీ చేయ‌డంతో పార్టీకి పెద్ద‌గా ఒరిగేదేమీ ఉండ‌ద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. అందుకే ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ హిందూపురం నుంచి కాకుండా కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుంచి రంగంలోకి దిగే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. త‌ద్వారా చంద్ర‌బాబు పోటీ చేసే జిల్లాతో పాటు బాల‌కృష్ణ పోటీ చేసే జిల్లాలోనూ పార్టీకి ఎక్కువ సీట్లు వ‌చ్చే అవ‌కాశాలు మెరుగ‌వుతాయ‌ని టీడీపీ వ‌ర్గాలు విశ్వ‌సిస్తున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News