వాజ్‌పేయి ఆరోగ్యంపై లాలూ కామెంట్స్?

Update: 2017-02-23 11:43 GMT
బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ప్ర‌ధాన మంత్రి అట‌ల్ బిహారీ వాజ్‌ పేయి ఆరోగ్యంపై బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయినా బీహార్‌లో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు కూడా లేవు. రెండేళ్ల క్రిత‌మే అక్క‌డ ఎన్నిక‌లు ముగియ‌గా, లాలూ పార్టీ పొత్తుపెట్టుకున్న జేడీయూ అధికారం చేజిక్కించుకోగా... జేడీయూ సీనియ‌ర్ నేత నితీశ్ కుమార్ ముచ్చ‌ట‌గా మూడో ప‌ర్యాయం సీఎంగా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం అక్క‌డ బీజేపీ చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. అలాంటిది బీజేపీని టార్గెట్ చేస్తూ లాలూ ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న‌దే ఇప్పుడు అర్ధం కాని ప్ర‌శ్న‌.

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం లేకున్నా ఫ‌ర‌వా లేదు కానీ.. అస‌లు వాజ్‌ పేయి ఆరోగ్యంపై లాలూ ప్ర‌సాద్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్ ఏమిట‌న్న విష‌యాన్ని ఓ సారి ప‌రిశీలిద్దాం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నేటి మ‌ధ్యాహ్నం అక్క‌డ ఏర్పాటు చేసిన ఓ స‌భ‌లో మాట్లాడిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్... వాజ్‌పేయి అనారోగ్యాన్ని బీజేపీ నేత‌లే కార‌ణ‌మ‌న్న కోణంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాజ్‌పేయికి మ‌త్తు మందు ఇచ్చి... రాజ‌కీయాలు అర్ధం కాని స్థితికి ఆయ‌న‌ను తీసుకొచ్చార‌ని లాలూ ఆరోపించారు. ఈ విష‌యం వాస్త‌వ‌మో, కాదో తేలాలంటే  వాజ్‌పేయి ఆరోగ్యంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కూడా లాలూ డిమాండ్ చేశారు. లాలూ  ఏం ఆశించి ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దు కానీ.... ఈ వ్యాఖ్య‌లు అటు బీజేపీలోనే కాకుండా, ఇటు వాజ్‌ పేయి అభిమానుల్లోనే పెను క‌ల‌వ‌రాన్నే రేపాయి.

అయితే వెనువెంట‌నే స‌ర్దుకున్న బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి రాధా మోహ‌న్ సింగ్... లాలూ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌యం సాధించిన నితీశ్ కుమారే... లాలూ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోర‌ని, అలాంటప్పుడు వాజ్‌ పేయిపై లాలూ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చేశారు. విమ‌ర్శ‌కు ప్ర‌తి విమ‌ర్శ క‌రెక్టే కావ‌చ్చు కానీ... లాలూ వ్యాఖ్య‌లు చేసింది సామాన్యుడి మీద కాదు క‌దా. దేశానికి మూడు ప‌ర్యాయాలు ప్ర‌ధానిగా ప‌నిచేసిన కీల‌క  వ్య‌క్తి మీద‌. అది కూడా ఏళ్లుగా బాహ్య ప్ర‌పంచం తెలియ‌కుండా మంచానికే ప‌రిమిత‌మైన బీజేపీ కురువృద్ధుడి మీద‌. రాధా మోహ‌న్ సింగ్ ఎంత చెప్పినా... లాలూ చేసిన వ్యాఖ్య‌ల పుణ్య‌మా అని వాజ్‌ పేయి ఆరోగ్యంపై మ‌రోమారు పెను దుమారం రేగేలాగే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News