లాస్‌ వెగాస్ కాల్పులు..బంప్‌ స్టాక్ త‌యారీదారుల‌పై కేసులు

Update: 2017-10-12 16:48 GMT
ప్ర‌పంచం నివ్వెరపోయేలా...సంగీత ప్రియుల‌పై విచ‌క్ష‌ణా ర‌హిత కాల్పుల‌కు వేదిక‌గా మారిన లాస్‌ వెగాస్ ఉదంతం త‌ర్వాత అమెరికన్ల ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ కాల్పుల కోసం దుండుగు స్టీఫెన్ వాడిన బంప్‌ స్టాక్ కార‌ణంగానే మార‌ణ‌హోమం పెద్ద ఎత్తున జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. బంప్‌ స్టాక్‌ వల్ల ఫైరింగ్‌ వేగాన్ని పెంచవచ్చు. ట్రిగ్గర్‌ కూడా ఈజీగా మూవ్‌ అవుతుంది. దీంతో క్షణాల్లో బుల్లెట్ల వర్షం కురుస్తుంది. ఒకరకంగా సెమీఆటోమెటిక్‌ వెపన్‌ ను ఈ బంప్‌ స్టాక్‌ ఓ అటోమెటిక్‌ వెపన్‌ గా మారుస్తుంది. అప్పుడు ఇది మెషీన్‌ గన్‌ లా బుల్లెట్లను వదులుతుంది. ఇంత‌టి ప్ర‌మాదహేతువు అయిన‌... బంప్‌ స్టాక్‌ తయారీదారులపై లాస్‌ వెగాస్‌ కాల్పుల ఘటనలోని బాధితులు కేసు నమోదు చేశారు.

సెమీ అటోమేటిక్‌ రైఫిల్‌ ను దాదాపు పూర్తి స్థాయి ఆటోమేటిక్‌ రైఫిల్‌ గా మార్చగలిగి, మరింత వేగంగా కాల్పులు జరిపేందుకు అనువుగా బంప్‌ స్టాక్‌ ను లాస్‌ వెగాస్‌ నిందితుడు ఉపయోగించాడు. అమెరికాలో పూర్తి ఆటోమేటిక్‌ మెషిన్‌ గన్స్‌ నిషిద్ధం. దానివల్లే మరింత రెచ్చిపోయేలా కాల్పులు జరిగి ఎక్కువమంది మరణించారు. దీంతో బంప్‌ స్టాక్‌ను తయారు చేసిన వారిపై నెవడాలోని క్లార్క్‌ కౌంటీలో గత వారాంతంలో కేసు దాఖలైంది. స్లైడ్‌ ఫైర్‌ సొల్యూషన్స్‌ - ఇతర పేరు వెల్లడించని తయారీదారుల నిర్లక్ష్యం వల్లనే ఈనాడు వేలాదిమంది బాధలు అనుభవిస్తున్నారని ఆ దావాలో వారు పేర్కొన్నారు. టెక్సాస్‌ కేంద్రంగా పనిచేసే స్లైడ్‌ ఫైర్‌ సంస్థకు చెందిన మోరాన్‌ దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఈ కేసులో నిందితుడు స్టీఫెన్‌ పడాక్‌ 32వ అంతస్తులోని హోటల్‌ గది నుండి తన రైఫిల్‌తో 10నిముషాల పాటు కాల్పులు జరిపాడని - నిముషానికి వందలాది రౌండ్లు కాల్పులు జరపడం వల్లనే ఇంతమంది మరణించారని అధికారులు తెలిపారు. అయితే 2005లో అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదించిన బిల్లు వల్ల ఈ కేసు అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి రావచ్చని జార్జియా యూనివర్శిటీలోని లా ప్రొఫెసర్‌ తిమోతి లిటన్‌ పేర్కొన్నారు. బంప్‌ స్టాక్‌ పరికరం అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన విడిభాగాల నిర్వచనం పరిధిలోకి రాలేదని కోర్టు ఆమోదిస్తే అప్పుడు ఈ కేసు నిలవగలదని భావిస్తున్నారు.

అమెరికాలో బంప్‌ స్టాక్‌ చాలా చీప్‌ డివైస్‌‌. దీన్ని ఆన్‌ లైన్‌ లో కేవలం వంద లేదా రెండు వందల డాలర్లకు ఖరీదు చేయవచ్చు. రైఫిల్‌ కు వెనుక భాగంలో అమర్చే ఎక్స్‌ ట్రా ఫిట్టింగే బంప్‌ స్టాక్‌. దీని వల్ల గన్‌ మూవ్‌ మెంట్‌ సులువు అవుతుంది. ట్రిగ్గర్‌ పై వేలు తీయకుండానే ఈజీగా గన్‌ ఫైర్‌ చేయవచ్చు. గన్‌ ముందుకు.. వెనక్కి ఈజీగా కదలడం వల్ల బుల్లెట్స్‌ డిస్‌ చార్జ్‌ చేసే స్పీడ్‌ కూడా పెరుగుతుంది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ బుల్లెట్లను ఫైర్‌ చేయవచ్చు. అయితే బంప్‌ స్టాక్‌ ను బ్యాన్‌ చేయాలని డెమోక్రటిక్‌ - రిపబ్లికన్‌ నేతలు ఇప్పుడు డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా తాజా కేసు న‌మోదు అయింది.
Tags:    

Similar News