బీసీసీఐ గ్రేడ్లు వచ్చేశాయ్.. వారిద్దరి స్థాయి డౌన్.. సిరాజ్ కు ప్రమోషన్

Update: 2022-03-03 03:36 GMT
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను విడుదల చేసింది. కొన్ని నెలలుగా టీమిండియాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాపై ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా కెప్టెన్సీలో అన్ని ఫార్మాట్లకు మార్పు జరిగి రోహిత్ శర్మకు పూర్తి స్థాయి పగ్గాలు అందడం మరింత ఆసక్తికరంగా మారింది. టెస్టు స్సెషలిస్టులుగా ముద్ర పడిన చతేశ్వర్పుజారా, అజింక్య రహానే ఫామ్ కోల్పోయి తంటాలు పడుతూ జట్టుకు దూరమైన పరిస్థితుల్లో వారి భవితవ్యం ఏమిటనే సందేహం రేకెత్తింది.

కాగా, బీసీసీఐ ఆటగాళ్లను ఏ ప్లస్, ఏ, బీ, సీ గ్రేడ్ లుగా విభజించి కాంట్రాక్టులు ఇస్తుంది. ఏ ప్లస్ కాంట్రాక్టు అనేదానిని నాలుగేళ్ల కింద ట ప్రారంభించింది. అంతకుముందు ఏ, బీ, సీ గ్రేడ్ లే ఉండేవి. అయితే, జట్టను మించి ఎదిగిన కోహ్లి, ధోని వంటి ఆటగాళ్ల స్థాయికి తగ్గట్లు ఏ ప్లస్ గ్రేడ్ ను ప్రవేశపెట్టింది. ఇక బుధవారం ఈ గ్రేడ్ ల వివరాలు వెల్లడించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ గ్రేడ్లను నిర్ణయించింది.


ఎవరికి అప్ ఎవరికి డౌన్?

ఇప్పటివరకు ఏ గ్రేడ్ లో ఉన్న టెస్టు స్పెషలిస్టులు పుజారా, మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గతేడాది వరకు వీరిద్దరూ ‘ఎ’ గ్రేడ్ ఆటగాళ్ల కేటగిరీలో ఉన్నారు. ఈ ఇద్దరూ గత కొద్ది కాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్నారు. దీంతో మార్చి 4 నుంచి శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వీరిద్దరినీ పక్కన పెట్టారు కూడా. అయితే, మరో ఆశ్చర్యకర గ్రేడింగ్ హార్దిక్పాండ్యా.

ప్రస్తుతం ఏ జట్టులోనూ సభ్యుడిగా లేని పాండ్యాను ఏ గ్రేడ్ నుంచి సి కి పడేశారు. వాస్తవానికి మూడేళ్ల కిందట వరకు పాండ్యా మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడు. 2019 ఆసియా కప్ లో వెన్నుముక గాయంతో బౌలింగ్ కు దూరమవడం అతడి కెరీర్ నే దెబ్బతీసింది. తిరిగి జట్టులోకి వచ్చినా ఒకటీ అరా మ్యాచ్ ల్లో తప్ప బౌలింగ్ చేయలేదు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కూ ‘సి’ గ్రేడ్‌ మాత్రమే దక్కింది. ఇటీవల వార్తల్లో నిలిచిన సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్ సాహా, మయాంక్‌ అగర్వాల్‌ ‘బి’ నుంచి ‘సి’ కి వెళ్లిపోయారు. వంద టెస్టులాడిన పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఏ నుంచి బి కి చేరాడు.

రూ.ఏడు కోట్ల నుంచి రూ.కోటి

ఏ ప్లస్ కాంట్రాక్టు ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఎ, బి, సి కేటగిరీ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, రూ.3 కోట్లు, రూ.కోటి కాంట్రాక్టు ఫీజుగా బీసీసీఐ ఇస్తుంది. దీనికి మ్యాచ్ ఫీజు అదనం. అయితే, ప్రస్తుతం ఏ ప్లస్ ముగ్గరికే దక్కింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, పేసర్ జస్ప్రిత్‌ బుమ్రా ఇందులో ఉన్నారు. అశ్విన్‌, జడేజా, పంత్‌, కేఎల్‌ రాహుల్‌,  మహ్మద్‌ షమీ ‘ఎ’లో ఉన్నారు. గతంలో ‘ఎ’గ్రేడ్‌లో 10 మంది ఆటగాళ్లకు చోటుండగా.. ఇప్పుడు ఈ ఐదుగురికే దానిని పరిమితం చేశారు.

మొత్తం 27 మందితో బీసీసీఐ వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది ఈ సంఖ్య 28 కావడం గమనార్హం. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ నవదీప్ సైనీకి కాంట్రాక్టు దక్కలేదు.

హైదరాబాదీ సిరాజ్ కు ప్రమోషన్

కొన్నాళ్లుగా జట్టు విజయాల్లో భాగమవుతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను సి గ్రేడ్ నుంచి బి కి ప్రమోట్ చేశారు. ఇటీవలి బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ కు సి గ్రేడ్ దక్కింది.

సాహాకు దారులు మూసుకుపోయినట్లే

వికెట్ కీపర్ సాహాకు టీమిండియా దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. కాంట్రాక్టు ఆటగాళ్లెవరూ బోర్డు, సెలక్షన్ కమిటీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. సాహా మాత్రం ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లపై వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికి బి గ్రేడ్ నుంచి తప్పించి సి గ్రేడ్ ఇచ్చినా.. జట్టులోకి ఎంపిక మాత్రం కష్టమే అని తెలుస్తోంది.
Tags:    

Similar News