లేఖ‌ల మీద లేఖ‌లు

Update: 2022-01-25 10:30 GMT
తెలంగాణ‌లో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‌, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏడేళ్లుగా రాష్ట్రంలో ఆధిప‌త్యం చ‌లాయించిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు బీజేపీ గ‌ట్టి స‌వాలు విసురుతోంది. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం సాధించే దిశ‌గా పార్టీని బ‌లోపేతం చేస్తోంది. ఆ పార్టీ అధిష్ఠానం కూడా రాష్ట్ర నాయ‌క‌త్వానికి పూర్తి అండ‌గా నిలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీని స‌మ‌ర్థంగా అడ్డుకునే దిశ‌గా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును కేసీఆర్ టార్గెట్ చేశార‌న్న‌ది తెలిసిన విష‌య‌మే. వ‌రి కోనుగోళ్ల విష‌యంపై పూర్తి బాధ్య‌త కేంద్రానిదే అంటూ ఆయ‌న నానా హంగామా చేశారు.

ఇక ఉద్యోగుల బ‌దిలీల కోసం తెచ్చిన 317 జీవోను స‌వ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దీక్ష‌.. అరెస్టు.. జైలు.. బెయిల్ ఇలా ఆ ఎపిసోడ్‌తో ప‌రిస్థితి మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక ఇప్పుడు ఆ రెండు పార్టీల ప్ర‌భుత్వాలు ఒక‌దానిపై మ‌రొక‌టి లేఖ‌ల యుద్ధం చేస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదంటూ వివిధ అంశాల‌పై టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్ రావు త‌దిత‌రులు లేఖ‌లు రాశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా మ‌రోసారి ప్ర‌ధాని మోడీకి లేఖ పంపించారు. కేంద్ర ప్ర‌భుత్వం అఖిల భార‌త స‌ర్వీస్ (ఏఐఎస్‌) నిబంధ‌న‌ల‌కు ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణ‌ల‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ కేసీఆర్ ఆ లేఖ రాశారు.

ఆ స‌వ‌ర‌ణ‌లు రాజ్యాంగ‌, స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని కేసీఆర్ అన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ల సేవా గుణాల‌ను దెబ్బ‌తీస్తాయ‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం వాటిని వ్య‌తిరేకిస్తుంద‌ని, వెంట‌నే ఉప సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. అడ్డ‌దారిన స‌వ‌ర‌ణ‌లు తేవ‌డం కాద‌ని ద‌మ్ముంటే వాటిని పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని స‌వాల్ విసిరారు. ప్ర‌స్తుత నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏఐఎస్ అధికారుల‌ను కేంద్రం డిప్యూటేష‌న్‌పై తీసుకుంటే రాష్ట్రాల అనుమ‌తి అవ‌స‌రం. కానీ రాష్ట్రాల‌తో సంబంధం లేకుండా కేంద్రం ఏక‌ప‌క్షంగా తీసుకునేలా ఈ స‌వ‌ర‌ణ చేశారు. రాష్ట్రాల్లో ప‌నిచేసే అధికారుల‌ను కేంద్రం ప‌రోక్షంగా నియంత్రించాల‌నుకుంటుంద‌ని కేసీఆర్ అన్నారు.

మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వ లేఖ‌ల‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ‌తోనే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం లేక‌పోవ‌డం వ‌ల్లే ఇక్క‌డ రైల్వే ప్రాజెక్టుల ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని కేసీఆర్‌కు రాసిన లేఖ‌లో బీజేపీ మంత్రి కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌కాలంలో త‌మ వాటా నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం, భూ కేటాయింపులు పూర్తి చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే తెలంగాణ‌లో ప‌నులు ఆల‌స్య‌మ‌వుతున్నాయ‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ప‌ని చేయ‌కుండా కేంద్రంపై నింద‌లు వేయ‌డం స‌రికాదంటూ ఆయ‌న పేర్కొన్నారు.


Tags:    

Similar News