జ‌గ‌న్ త‌ర్వాత పార్టీ సంగ‌తి చూడు బాబు

Update: 2016-06-21 06:12 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు భారీ ఝ‌ల‌క్ త‌గిలింది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశం తీవ్ర ర‌భ‌స‌గా మారి ఏకంగా పోలీసులు ప‌హారా కాసే స్థాయికి చేరింది. ఇది జ‌రిగింది క‌డప జిల్లా పొద్దుటూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధ్యక్షుడు - మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి - నియోజ‌క‌వ‌ర్గ‌ ఇన్‌ ఛార్జి వరదరాజులురెడ్డి మధ్య ఈ వాగ్వాదం చోటుచేసుకొంది. ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగి రెండు వర్గాలుగా విడిపోవడంతో సమన్వయకమిటీ సమావేశం అర్ధంతరంగా ఆగింది.

సభ ఆగిపోవడానికి దారి తీసిన వివరాలిలా ఉన్నాయి. నియోజకవర్గ ఇన్‌ ఛార్జి వరదరాజులురెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సభకు లింగారెడ్డి హాజరయ్యారు. ఆయన వెంట ముఖ్య అనుచ‌రుడు పర్లపాడు వెంకటసుబ్బారెడ్డి వెళ్లారు. ‘నీవు సభ్యుడివి కాదు.. నీవు బయటికెళ్లు' అని వెంకటసుబ్బారెడ్డిని వరద అన్నారు. వెంకటసుబ్బారెడ్డి జోక్యం చేసుకొని రాజుపాళెం మండలంలో ఆరు దఫాలుగా అధ్యక్షుడిగా పని చేశానని, సమన్వయ కమిటీ సభ్యుడుని అని బదులిచ్చారు. తర్వాత లింగారెడ్డి జోక్యం చేసుకొని పాత సభ్యులకు తెలియకుండా తొలగించి కొత్త సభ్యులతో సమావేశం ఎలా జరుపుతారని వరదరాజులురెడ్డిని అడిగారు. 'నీకు చెప్పాల్సిన అవసరం లేదు.నేను ఇన్‌ ఛార్జిని నాకు ఇష్టమొచ్చినట్లు చేస్తా'అని వరదరాజులురెడ్డి అనడంతో సభలో గందరగోళం చోటుచేసుకుంది. చివరికి సమావేశం ఆగిపోయింది. రెండు వర్గాలుగా విడిపోవడంతో అతిథి భవనంలో కాసేపు ఏం జరుగుతుందోననే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పహారా కాసి అనంత‌రం ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

సభలో జరిగిన విషయమై వరదరాజులురెడ్డి మాట్లాడుతూ సమస్యను సీఎం చంద్రబాబు - తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటానన్నారు. లింగారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాత - కొత్త కార్యకర్తలు - నాయకుల మధ్య సమస్యలున్నాయని, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సమన్వయ కమిటీ సభలో వివాదం జరగడం విచారకరమని పురపాలక సంస్థ అధ్యక్షుడు గురివిరెడ్డి పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన వారికి గుర్తింపులేదన్నారు. రోజు - రోజుకు పార్టీకి విలువలు - నైతిక విలేవల్లేకుండా పోతున్నాయి. ప్రొద్దుటూరులో ఫ్యాక్షన్‌ కు దారి తీసేలా పరిస్థితి ఉంది. రెండు వర్గాల వారిని పిలుపించుకొని సర్దిచెప్పి పార్టీని బలోపేతానికి కృషి చేయాల్సిన ఆవశ్యకత సీఎంకు ఉందని లేదంటే పార్టీ బలహీనపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

ఇదిలా జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ రెడ్డి  మాట్లాడుతూ వరదరాజులరెడ్డి తన‌కు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లింగారెడ్డి ఆధ్వర్యంలో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని పని చేస్తున్న. పాత కార్యకర్తలు - నేతల పట్ల వరదరాజులురెడ్డి వివక్ష చూపుతున్నారన్నారు. నియోజకవర్గ ఇన్‌ ఛార్జిగా ఏకపక్ష ధోరణితో వెళ్తూ - పాత కార్యకర్తలను - నేతలను పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ఇరువురి వర్గాల మధ్య సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మళ్లీ సమావేశం జరపడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది.
Tags:    

Similar News