క‌డ‌ప‌లో స‌చివాల‌యానికి తాళం.. కాంట్రాక్ట‌ర్‌కు డ‌బ్బివ్వ‌క‌పోవ‌డ‌మే రీజ‌న్‌!!

Update: 2022-04-27 14:30 GMT
ఏపీ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న స‌చివాల‌య వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ లోపంతోను, నిధుల లోపంతోనూ .. తీవ్ర ఇబ్బందులు ప‌డుతోంది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, గుంటూరు స‌హా.. అనంత‌పురంలోనూ.. స‌చివాల యాల‌కు అద్దెలు చెల్లించ‌డం లేద‌నే కార‌ణంగా ఆయా స‌చివాల‌యాల‌కు తాళం వేశారు. తాజాగా ఇప్పుడు సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా వైఎస్సార్ క‌డ‌ప‌లో ఏకంగా కాంట్రాక్ట‌రే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఘ‌ట‌న వెలుగు చూసింది.

రాష్ట్ర వ్యాప్తంగా.. స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్న స‌ర్కారు..వీటికి భ‌వ‌నాలు ఏర్పాటు చేయ‌క‌పోవడం గ‌మ‌నార్హం. దీంతో చాలా వ‌ర‌కు జిల్లాల్లో స‌చివాల‌యాల‌ను అద్దె భవనాలలో నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కు స్కూళ్ల లో ఉన్న స్థ‌లాల్లో నిర్వ‌హించినా.. హైకోర్టు తీర్పుతో వాటిని త‌ప్పించి..అద్దె భ‌వ‌నాల‌కు మార్చారు. దీంతో అద్దె చెల్లించ‌డం లేద‌నే ఘ‌ట‌న‌లు కొన్నాళ్లుగా వెలుగు చూస్తున్నాయి.

అయితే.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలో..స‌చివాల‌య కార్యాల‌యాన్ని ప్ర‌భుత్వ స్థ‌లంలోనే నిర్మించారు. అయితే..  ఇలా ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఓ కాంట్రాక్ట‌ర్‌ నిర్మించారు. అయితే.. ఇది నిర్మించి రెండేళ్లు అయినా.. నిబంధ‌న‌ల మేర‌కు త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఇవ్వ‌లేద‌ని.. కాంట్రాక్ట‌ర్ క‌న్నెర్ర చేశాడు. స‌చివాల‌యానికి ఏకంగా తాళం వేసి.. డ‌బ్బులు ఇస్తేనే.. తాళంతీస్తానంటూ.. భీష్మించాడు.

 వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి కాంట్రాక్ట‌ర్‌ తాళం వేశారు. గ్రామ సచివాలయం నిర్మించి రెండేళ్లు అవుతున్నా అధికారులు బిల్లులు చెల్లించలేదని కారణంతో గుత్తేదారు వాసుదేవరెడ్డి ఇవాళ ఉదయం సచివాలయానికి తాళం వేశారు. 48 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయానికి సంబంధిత పంచాయతీ అధికారులు పర్సెంటేజ్ తీసుకున్నప్పటికీ ఇంతవరకు బిల్లు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాసుదేవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో సచివాలయం సిబ్బంది ఉన్న‌తాధికారులకు ఈ విషయం తెలియజేసి భవనం ఎదుట చెట్టు కింద కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. సచివాలయాన్ని 2020 అక్టోబర్ 2వ తేదీన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు.

అప్పటి నుంచి కూడా పలుమార్లు అధికారులకు వెళ్లినప్పటికీ స్పందించలేదని తెలిపారు. తనకు బిల్లు చెల్లించే వరకు సచివాలయం తలుపులు తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో సచివాలయానికి విధుల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు తాళం వేసి ఉండటంతో బయట చెట్ల కింద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Tags:    

Similar News