మూడు సార్లు ఎమ్మెల్యే.. అయినా గుర్తింపు లేదా? టీడీపీలో చిత్రం!

Update: 2022-08-27 00:30 GMT
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న కొంద‌రు నాయ‌కులు ఎంత చేస్తున్నా.. పెద్ద‌గా గుర్తింపు లేకుండా పోతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. ఓడిపోయిన వారికి.. గ‌త ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్లు కూడా ద‌క్క‌ని వారికి ఉన్న గుర్తింపు త‌మ‌కు ద‌క్క‌డం లేద‌ని.. స‌ద‌రు నాయ‌కులు వాపోతున్నారు. అంతేకాదు.. త‌మ‌కు అధిష్టానం ద‌గ్గ‌ర కూడా పెద్ద‌గా ప‌లుకు బ‌డి లేద‌ని.. వారు వాపోతున్నారు. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు.. ఉమ్మ‌డితూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన మండ‌పేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు. ఈయ‌న సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.

వ‌రుస విజ‌యాల‌తోనూ దూసుకుపోతున్నారు. 2009, 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న మండ‌పేట నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్త‌వానికి.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్న వారు చాలా చాలా త‌క్కువ మంది ఉన్నారు.

ఇలాంటి వారిలో  జోగేశ్వ‌ర‌రావు ఒక‌రు. అంతేకాదు.. చంద్ర‌బాబు పిలుపు మేర‌కు ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా వేగంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు లేకుండానే .. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు అవ‌కాశం వ‌చ్చింది.

అయితే.. ఇప్పుడు ఈయ‌న‌కు ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క‌పోవ‌డం.. సీనియార్టీని వినియోగించుకోలేక పోవ‌డం .. పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కొంద‌రు నాయ‌కులు చెబుతున్న మాట‌ల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. అందుకే త‌మ నాయ‌కుడికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. వేగుళ్ల వ‌ర్గం కూడా బాధ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ నాయ‌కుడిదే విజ‌యం అంటున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి తోట త్రిమూర్తులు ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో రామ‌చంద్ర‌పురం నుంచి తోట పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో చేరిపోయారు. ఎమ్మెలల్సీ కూడా అయ్యారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మండ‌పేట నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు.

వైసీపీ అధిష్టానం కూడా ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో మ‌రింత బ‌లంగా.. తాను ప‌నిచేసేందుకు అధిష్టానం నుంచి స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని.. త‌న అనుచ‌ర‌ల‌తో వేగుళ్ల వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. టీడీపీ అధినేత వేగుళ్ల‌కు ద‌న్నుగా నిలుస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News