మ‌ర్రిలాంటి మేధావి ఇలా అయ్యారేంట‌బ్బా?

Update: 2018-11-19 05:02 GMT
కొంత‌మంది ప్ర‌ముఖ నేత‌ల తీరు చూస్తే నోట మాట రాని ప‌రిస్థితి. ప్ర‌జ‌ల్లో వారికి ఉండే ప‌లుకుబ‌డికి భిన్నంగా కొన్ని సంద‌ర్భాల్లో వారు వ్య‌వ‌హ‌రించే తీరు ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉండ‌ట‌మే కాదు.. ఇలా చేస్తారా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. సీఎం స్టేచ‌ర్ త‌న‌ద‌ని గొప్ప‌లు చెప్పుకునే నేత‌.. ఎమ్మెల్యే టికెట్ కోసం మ‌రీ ఇంత‌లా ర‌చ్చ చేస్తారా? అన్న వాద‌న ఇప్పుడు వినిపిస్తోంది. ఇంత‌కీ.. ఇదంతా ఎవ‌రి గురించో ఇప్ప‌టికే మీకు అర్థ‌మయ్యే ఉంటుంది.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. ఆ పార్టీ అధినాయ‌క‌త్వానికి స‌న్నిహితుడిగా పేరున్న మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డికి స‌న‌త్ న‌గ‌ర్ సీటు ఇవ్వ‌క‌పోవ‌ట‌మే కాదు.. ఆ సీటును మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీకి కేటాయించ‌టం ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. సంచ‌ల‌న‌మైంది. స‌న‌త్ న‌గ‌ర్ నుంచి తాను త‌ప్పించి మ‌రెవ‌రో పోటీ చేయ‌ట‌మా? అంటూ ప్ర‌శ్నించే మ‌ర్రికి దిమ్మ తిరిగే షాక్ త‌గ‌ల‌టంతో అర్జెంట్ గా ఢిల్లీ ప‌య‌న‌మ‌య్యారు. తాను పోటీ చేసి ఓడిన స్థానాన్ని మిత్ర‌ప‌క్షానికి కేటాయించ‌టం ఏమిటంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏదైనా కార‌ణం చేత ఒక సీనియ‌ర్ కు టికెట్ ఇవ్వ‌కుంటే.. మూడో కంటికి తెలీకుండా పార్టీ వ‌ద్ద‌కు వెళ్లాలే కానీ.. ప్రెస్ మీట్ పెట్టి ర‌చ్చ చేసుకోవ‌టం ఎంత మాత్రం స‌బ‌బు కాదు. మ‌రీ.. చిన్న విష‌యాన్ని మ‌ర్రి ఎందుకు మిస్ అయ్యారో అర్థం కాని ప‌రిస్థితి.

గ్రౌండ్ రిపోర్ట్ ప్ర‌కారం చూస్తే.. తాజా మాజీ మంత్రి త‌ల‌సానిని ఎదుర్కొనేంత సీన్ మ‌ర్రికి లేద‌ని.. ఆయ‌న పిచ్చ క్లాస్ త‌ప్పించి.. మాస్ కు ఏ మాత్రం ఆయ‌న తీరు ఎక్క‌ద‌ని చెబుతారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు పెద్ద‌గా అందుబాటులో లేర‌న్న విమ‌ర్శ‌ల‌తో పాటు.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారాన్నిపెద్ద‌గా ప‌ట్టించుకోని మ‌ర్రికి కాంగ్రెస్ పార్టీ త‌గిన శాస్తి చేసింద‌న్న మాట ప‌లువురి నోటి వెంట రావ‌టం గ‌మ‌నార్హం.

త‌న‌కు టికెట్ ఇవ్వ‌ని వైనంపై అధినాయ‌క‌త్వంతో మాట్లాడ‌టానికి ఢిల్లీ వెళ్లిన ఆయ‌న‌.. ఆఖ‌రి నిమిషంలో అద్భుతం జ‌రిగే ఆశ‌తో హ‌స్తిన‌కు వెళ్లిన‌ట్లు చెబుతారు. అయితే.. మ‌ర్రి విష‌యంలో ఇప్ప‌టికే ఒక క్లారిటీకి వ‌చ్చేసిన  కాంగ్రెస్ అధినాయ‌త్వం ఆయ‌న వేద‌న‌పై సానుకూలంగా స్పందించ‌లేద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే.. త‌న‌కు కాకుండా మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ అభ్య‌ర్థి కూన వెంక‌టేశ్ కు టికెట్ కేటాయించ‌టంపై ప్రెస్ మీట్ పెట్టి ఆవేద‌న వ్య‌క్తం చేసిన మ‌ర్రి.. ఇప్పుడు తాను పార్టీ మార‌న‌ని.. పార్టీలోనే కొన‌సాగుతాన‌ని చెబుతున్నారు.ఈ తెలివి ఏదో నోరు విప్ప‌టానికి ముందే.. టికెట్ రాలేద‌ని గుండెలు బాదుకునే వేళ‌లో వ‌స్తే ఎంత బాగుండేది?  మేధావి వ‌ర్గానికి చెందిన మ‌ర్రి లాంటోళ్లు సైతం ప‌రిప‌క్వ‌త లేని నేత‌లా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటి?

    
    
    

Tags:    

Similar News