మేకపాటి ఫ్యామిలీకి ఆ హామీ ?

Update: 2022-03-27 12:33 GMT
వైసీపీలో కీలకమైన పాత్ర పోషించే కుటుంబంగా మేకపాటిని చెప్పుకోవాలి. తండ్రి రాజమోహనరెడ్డి జగన్ కి పార్టీ పెట్టిన తొలినాళ్ళలో అండదండగా నిలిచారు. ఇక కొడుకు గౌతం రెడ్డి అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ పటిష్టం కావడానికి తనదైన శైలిలో కృషి చేశారు. ఇపుడు తండ్రి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కొడుకు నెల రోజుల క్రితం భౌతికంగా ఈ లోకం నుంచి దూరం అయ్యారు.

నెల్లూరు జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబం అయిన మేకపాటి వారు ఇపుడు ఏం చేస్తారు, వారిని వైసీపీ ఏ విధంగా కలుపుకుని ముందుకు వెళ్తుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నెల 28న నెల్లూరు జిల్లాలోని కనుపర్తిపాడులోని వీపీయార్ కన్వెన్షన్ హాలులో గౌతం రెడ్డి సంతాపసభ జరగనుంది.

ఈ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. ఆయన కీలక ప్రసంగం చేస్తారు. గౌతం రెడ్డి తో తన అనుబంధాన్ని  మరో మారు వల్లె వేస్తారు. అంతే కాదు, మేకపాటి ఫ్యామిలీకి రాజకీయంగా గట్టి భరోసా ఇస్తారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సభలోనే ఆత్మ‌కూరు ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అని వెల్లడి అవుతుంది అంటున్నారు.

గౌతం రెడ్డి సతీమణికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అనుకుంటోంది అని అంటున్నారు. మరి ఆ విషయం జగన్ సమావేశంలో ప్రకటిస్తారా అన్నది చూడాలి. అదే విధంగా మేకపాటి ఫ్యామిలీ వైసీపీకి బ్యాక్ బోన్ కాబట్టి ఆ ఫ్యామిలీని కలుపుకుని నెల్లూరు జిల్లాలో పొలిటికల్ గా ముందుకు సాగాల్సి వస్తుంది. నిజానికి గౌతం రెడ్డి బతికి ఉంటే మంత్రి వర్గ విస్తరణలో ఆయన్ని కొనసాగించేవారు అన్న మాట కూడా ఉంది.

ఆయన చేపట్టిన కీలక మంత్రిత్ర శాఖలు అలాంటివి. పైగా జగన్ మనసెరిగిన నేత. దాంతో ఆయన తప్పకుండా కొనసాగుతారు అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే గౌతం రెడ్డి లేరు. ఆయన సతీమణికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నా ఆమె రాజకీయంగా జూనియర్  కావడంతో మంత్రి పదవి ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఇక మేకపాటి ఫ్యామిలీలో చూస్తే గౌతం బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.

ఆయన సీనియర్ నేత. అయితే ఈసారి ఎంపిక చేయబోయేది ఎన్నికల క్యాబినెట్. అందువల్ల కచ్చితంగా దూకుడుగా ఉండే నేతలకే మంత్రి పదవులు ఇవ్వాలని జగన్ నియమం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి తోడు నెల్లూరు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది రేసులో ఉన్నారు. దాంతో జగన్ మేకపాటి ఫ్యామిలీని పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉండవచ్చు అంటున్నారు. మరి అదే కనుక జరిగితే ఆ ఫ్యామిలీ నుంచి ఏమైనా అసంతృప్తి స్వరం బయటకు వస్తుందా అన్నది కూడా చూడాలి.

మొత్తానికి చూస్తే గౌతం రెడ్డి సంతాప సభ మాత్రం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యమంత్రి ఏం చెబుతారు. మేకపాటి ఫ్యామిలీ ఏమి ఆశిస్తోంది. వారికి ఏ రకమైన హామీ కావాలీ అన్నది కూడా చర్చగా ఉంది. ఒకవేళ మంత్రి పదవి మేకపాటి ఫ్యామిలీకి ఇవ్వకపోతే ఆత్మకూరు పోటీకి కూడా ఆ ఫ్యామిలీ దూరంగా ఉన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News