షర్మిల రాజన్న రాజ్యం వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ సెటైర్

Update: 2021-03-19 13:11 GMT
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వడివడిగా ముందుకెళుతున్న వైఎస్ షర్మిలకు తొలిసారి టీఆర్ఎస్ తరుఫున కౌంటర్ ఇచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్. ఇప్పటికే జిల్లాలో వైఎస్ అభిమానులతో.. తనతో కలిసి వచ్చే ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల ఏప్రిల్ 9వ తేదిన ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ఊపిరి ఆడనివ్వకుండా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

షర్మిల త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అదే జిల్లాకు చెంది మంత్రి పువ్వాడ అజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల రాజన్న రాజ్యం తెస్తానని చెప్తున్నారని.. కానీ ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూశారని.. ఆ తర్వాత కేసీఆర్ వైపు మళ్లారని పువ్వాడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా రాజన్న రాజ్యం తెలంగాణ ప్రజలకు అవసరం లేదన్నారు.

ఖమ్మం ప్రజలు ఎవరి ట్రాప్ లోనూ పడరని.. ఒకవేళ చిన్నా చితకా నాయకులు పడితే వాళ్ల ఇష్టం అంటూ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు మాత్రం ప్రభుత్వానికి.. సీఎం కేసీఆర్ కు ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని ఆయన కితాబిచ్చారు.

ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 150 కోట్ల రూపాయలను కేటాయించారని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే ఖమ్మం జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందని.. కొత్త వారు అవసరం లేదని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.
Tags:    

Similar News