తేడా వ‌స్తే ప‌ళ‌ని సీటుకు ఎర్త్ పెట్టేస్తాడ‌ట‌

Update: 2017-06-10 04:58 GMT
రెండు ఆకుల చిహ్నం గ‌ల అన్నా డీఎంకే పార్టీ పార్టీ నేత‌ల కుంప‌ట్ల‌తో మూడు గ్రూపులు ఏర్పాటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ ప‌రంగా చూస్తే ఇప్పుడు అన్నాడీఎంకే సీనియ‌ర్ నేత‌, అమ్మ అనుచ‌రుడైన మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం ఒక వ‌ర్గం, ప్ర‌స్తుత సీఎం ప‌ళ‌నిస్వామి ఇంకో వ‌ర్గం - అమ్మ నెచ్చెలిగా ఒక‌నాడు ఉండి ప్ర‌స్తుతం  జైల్లో ఉన్న చిన్న‌మ్మ శ‌శిక‌ళ ఇంకో వ‌ర్గం. ఇక అమ్మ కుటుంబ స‌భ్యులైన దీపా - ఆమె సోద‌రుడు వేర్వేరు వ‌ర్గాలు, దీప భ‌ర్తది ఇంకో వేదిక‌. తాజాగా చిన్న‌మ్మ మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ ఎమ్మెల్యేల‌ను చీల్చుతున్న నేప‌థ్యంలో శాసనసభ ప్రతిపక్షనేత, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అన్నాడీఎంకే పలు వర్గాలుగా చీలిపోయిందని, దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ముఖ్య‌మంత్రి ఎడప్పాడి పళనిస్వామి  కుస్తీ పడుతున్నారని విప‌క్ష నేత అయిన స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. పళనిస్వామి ప్రభుత్వానికి ఆధిక్యం తగ్గితే, అవసరమైతే గవర్నరును తాము కలుస్తామని స్ప‌ష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకే ప‌రిణామాలను అత్యంత జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నామ‌ని, తేడా వ‌స్తే ప‌ళ‌నిని కుర్చీ నుంచి దింప‌డం ఖాయ‌మ‌ని స్టాలిన్ చెప్పేశారు. చెన్నై నగర శివారులోని తండలంలోని కొలను పూడికతీత పనులను కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన స్టాలిన్ ఆ పనులు పూర్తయిన సంద‌ర్భంగా  కొలనును పరిశీలించి దాని చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  ఈ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా తాజా ప‌రిణామాల గురించి మాట్లాడుతూ తమిళనాడులో డీఎంకే హయాంలో కొలనులు, చెరువుల పూడిక తీయించామని స్టాలిన్ తెలిపారు. ఆ తర్వాత ఆరేళ్ల అన్నాడీఎంకే పాలనలో ఈ పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. అందుకే తామే నిర్వహించామని వివరించారు. డీఎంకే గెలిచిన 89 శాసనసభ నియోజకవర్గాల్లో 50-60 శాతం వరకు జలవనరుల్లో పూడికతీత పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. ఈ పనులు చేపట్టిన డీఎంకే కార్యకర్తలు అభినందనీయులని, వారికి అధిష్ఠానం తరఫున కృతజ్ఞతలు చెప్పారు. ఇవన్నీ చూసి ఇప్పుడు ప్రభుత్వం మేల్కొందని విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News